20, జనవరి 2026, మంగళవారం

పాస్కకాలపు ఆరవ ఆదివారం

పాస్కకాలపు ఆరవ ఆదివారం 

 అపొస్తలుల కార్యములు 15:1-29, దర్శన 21:10-14,22-23, 

యోహాను 14:23-29 
దేవుని ప్రియమైన సహోదరి సహోదులారా నేడు మనమందరం కూడా పాస్క కాలపు ఆరవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. నేటి ఈ మూడు దివ్యగ్రంధ పఠనాలలో దేవుని ప్రణాళికలో, ఆయన ప్రేమలో, మరియు ఆయన మనకిచ్చిన వాగ్దానాలలో మనం నిలకడగా ఉండాలని ప్రోత్సహిస్తాయి. సంఘంలో ఐక్యత, భవిష్యత్తుపై ఆశ, మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం క్రీస్తులో పరిపూర్ణమైన జీవితాన్ని గడపగలం.
       నేటి మొదటి పఠనములో మనము ముఖ్యమైన విషయాలను గ్రహించాలి. 
ఐక్యత ముఖ్యం: సంఘంలో ఐక్యత ఎంత ముఖ్యమో ఈ వచన భాగం తెలియజేస్తుంది. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, మనం కలిసి కూర్చుని, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించి, దేవుని వాక్యం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి.

 * సువార్త వ్యాప్తి: ధర్మశాస్త్రం కంటే యేసుక్రీస్తు ద్వారా లభించే కృప ద్వారానే రక్షణ అని స్పష్టం చేయడం ద్వారా, సువార్త అన్యజనుల మధ్య విస్తరించడానికి మార్గం సుగమం అయ్యింది. మన జీవితాల్లో కూడా, మనం నియమ నిబంధనలకు బానిసలుగా కాకుండా, క్రీస్తు కృప ద్వారా స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి మరియు ఆ సువార్తను ఇతరులకు ప్రకటించాలి.

* పరిశుద్ధాత్మ నడిపింపు: పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. సంఘ సమావేశాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి.

* రెండవ  పఠనములో నూతన యెరూషలేము యొక్క 
మహిమ అద్భుతమైన చిత్రాన్ని మనకు అందిస్తాయి. ఇది భూమిపై మానవ నిర్మితమైన నగరం కాదు, దేవుని నుండి ఆకాశం నుండి దిగివచ్చే ఒక పవిత్ర నగరం. ఈ నగరం దేవుని మహిమతో ప్రకాశిస్తుంది, దీనికి సూర్యుడు లేదా చంద్రుని వెలుగు అవసరం లేదు, ఎందుకంటే దేవుని మహిమే దాని వెలుగు, మరియు గొర్రెపిల్ల దాని దీపం. నగర గోడలు రత్నాలతో నిర్మించబడ్డాయి మరియు దాని పునాదులు పన్నెండు అపొస్తలుల పేర్లను కలిగి ఉన్నాయి. 
ఇక్కడ  * దేవుని సన్నిధి , నూతన యెరూషలేములో దేవుని సన్నిధి నిరంతరం ఉంటుంది. అక్కడ దేవాలయం ఉండదు, ఎందుకంటే సర్వాధికారియైన దేవుడు మరియు గొర్రెపిల్ల దానికి ఆలయం. ఈ లోకంలో దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే మన అంతిమ గమ్యం ఆయన సన్నిధిలో నివసించడమే.
 * మహిమ మరియు నిత్యత్వం: నూతన యెరూషలేము దేవుని మహిమకు, పరిపూర్ణతకు, నిత్యత్వానికి ప్రతీక. ఈ లోక కష్టాలు, శ్రమలు తాత్కాలికమైనవి. దేవుడు మన కొరకు సిద్ధం చేసిన నిత్యమైన నివాసం కోసం మనం ఎదురు చూడాలి.
 * భవిష్యత్తు ఆశ: ఈ వచనాలు మనకు భవిష్యత్తుపై గొప్ప ఆశను ఇస్తాయి. క్రీస్తును విశ్వసించే వారికి దేవుడు సిద్ధం చేసిన అద్భుతమైన ప్రణాళికను ఇవి తెలియజేస్తాయి.
       చివరిగా యోహాను 14:23-29 – యేసు వాగ్దానాలు మరియు పరిశుద్ధాత్మ ఈ భాగంలో యేసు తన శిష్యులకు కొన్ని అమూల్యమైన వాగ్దానాలను చేస్తాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన తండ్రి వారితో నివాసం ఉంటారని, మరియు వారికి సమాధానం లభిస్తుందని తెలియజేస్తాడు. యేసు వెళ్ళిపోతున్నాడని శిష్యులు దుఃఖించినప్పుడు, ఆయన వారికి "సమాధానము మీకు అనుగ్రహించి వెళ్లుచున్నాను; నా సమాధానమే మీకు ఇచ్చుచున్నాను; లోకమిచ్చునట్లుగా నేను మీకు ఇయ్యను" అని ఓదార్చాడు. అంతేకాకుండా, సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మను పంపుతానని, ఆయన వారికి సమస్తము బోధించి, యేసు చెప్పినవన్నీ జ్ఞాపకం చేస్తాడని వాగ్దానం చేశాడు.
మన ధ్యానం:
 * ప్రేమ మరియు విధేయత: దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం. మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే, అంతగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం.
 * దైవిక సమాధానం: లోకమిచ్చే సమాధానం తాత్కాలికం, కానీ యేసు ఇచ్చే సమాధానం శాశ్వతమైనది. కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ, క్రీస్తులో మనం నిజమైన సమాధానాన్ని కనుగొనగలం.
 * పరిశుద్ధాత్మ శక్తి: పరిశుద్ధాత్మ మనకు బోధకుడు, జ్ఞాపకం చేసేవాడు, ఓదార్చేవాడు. ఆయన సహాయం లేకుండా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము. ప్రతిరోజూ పరిశుద్ధాత్మ నడిపింపు కోసం మనం ప్రార్థించాలి.
 * భయం వద్దు: యేసు "మీ హృదయములను కలవరపడనియ్యకుడి, భయపడనియ్యకుడి" అని చెప్పాడు. భవిష్యత్తు గురించి భయం ఉన్నప్పుడు, యేసు చేసిన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనతో ఉన్నాడు, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు.
ఈ మూడు వచన భాగాలు దేవుని ప్రణాళికలో, ఆయన ప్రేమలో, మరియు ఆయన మనకిచ్చిన వాగ్దానాలలో మనం నిలకడగా ఉండాలని ప్రోత్సహిస్తాయి. సంఘంలో ఐక్యత, భవిష్యత్తుపై ఆశ, మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం క్రీస్తులో పరిపూర్ణమైన జీవితాన్ని గడపలం.
చివరిగా ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. అపొస్తలుల కార్యములు సువార్త యొక్క సార్వత్రికతను, సంఘం ఐక్యంగా ఎలా ముందుకు సాగాలో చూపిస్తుంది. యోహాను సువార్త ప్రస్తుత జీవితంలో విశ్వాసులు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును, మరియు ఆయనిచ్చే సమాధానాన్ని ఎలా అనుభవించాలో వివరిస్తుంది. ప్రకటన గ్రంథం ఈ ప్రణాళికలన్నింటికీ అంతిమ గమ్యాన్ని, దేవుని నిత్యమైన మహిమను మరియు తన ప్రజలతో ఆయన పరిపూర్ణమైన సన్నిధిని వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను ప్రేమించి, ఆయన కృపను అనుభవిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవిస్తే, చివరికి ఆయన సిద్ధం చేసిన మహిమగల నిత్య నివాసంలోకి ప్రవేశిస్తాము అనే గొప్ప నిరీక్షణ ఈ వాక్యాలు మనకు ఇస్తున్నాయి. ఈ వచన భాగాలు ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. అపొస్తలుల కార్యములు సువార్త యొక్క సార్వత్రికతను, సంఘం ఐక్యంగా ఎలా ముందుకు సాగాలో చూపిస్తుంది. యోహాను సువార్త ప్రస్తుత జీవితంలో విశ్వాసులు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును, మరియు ఆయనిచ్చే సమాధానాన్ని ఎలా అనుభవించాలో వివరిస్తుంది. ప్రకటన గ్రంథం ఈ ప్రణాళికలన్నింటికీ అంతిమ గమ్యాన్ని, దేవుని నిత్యమైన మహిమను మరియు తన ప్రజలతో ఆయన పరిపూర్ణమైన సన్నిధిని వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను ప్రేమించి, ఆయన కృపను అనుభవిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవిస్తే, చివరికి ఆయన సిద్ధం చేసిన మహిమగల నిత్య నివాసంలోకి ప్రవేశిస్తాము అనే గొప్ప నిరీక్షణ ఈ వాక్యాలు మనకు ఇస్తున్నాయి.
 ‌ 
Fr. Johannes OCD

మరియమాత -దేవుని తల్లి

 మరియమాత -దేవుని తల్లి

 యోహాను 19: 25-34 

యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లొఫా భార్యయగు  మరియమ్మయు, మగ్ధలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, "స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!" అనెను. ఆ తరువాత శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, "నాకు దాహమగుచున్నది." అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు  ఆ రసమును  అందుకొని "సమాప్తమైనది" అని తలవంచి, ప్రాణము విడిచెను. అది పాస్కపండుగకు సిద్దపడు దినము. అందుచే యూదులు పిలాతును, "రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి. కావున సైనికులు వెళ్లి, యేసుతో పాటు సిలువవేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. 

మరియమాత శ్రీ సభ తల్లి 

యేసు ప్రభువు మరణించే ముందు సిలువ మీద ఉన్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని, మరియు మరియమాతతో యోహాను చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాత మనకు తల్లిగా తిరుసభను అన్ని విధాలుగా మనలను ఆదరిస్తుంది. ఎప్పుడు తిరుసభకు తోడుగా ఉంటూ, తిరుసభకు అవసరమైన వాటికోసం ప్రార్థిస్తుంది. 

ఇదిగో నీ కుమారుడు: పునీత యోహాను యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, కడరా భోజన సమయంలో యేసు ప్రభువుని హృదయమునుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రభువుని ముఖ్యమైన ముగ్గురు శిష్యులలో ఒకడు. యేసు ప్రభువుని శ్రమల సమయంలో రహస్యంగా ప్రభువును అనుసరించినవాడు. ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు సిలువ క్రింద ఉన్నవాడు. అటువంటి శిష్యుని ప్రభువు తన తల్లికి అప్పగిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాతకు కుమారునిగా ఇచ్చినది కేవలం యోహానును కాదు, తాను ప్రేమించితిన శిష్యుడను,  ఇక్కడ ప్రభువుచే ప్రేమించబడిన ఆ శిష్యుడు తిరుసభకు గుర్తు. ప్రభువు మరియమాతకు ఇచ్చినది యోహాను రూపంలో తిరుసభను. యోహాను ప్రభువును విశ్వసించే ప్రతి విశ్వాసికి ప్రతిరూపంగా  ఉన్నాడు. 

నిన్ను వీడని తల్లి 

తల్లిగా మరియమాత ఎప్పుడు తన కుమారున్ని విడువలేదు. యేసు ప్రభువును ఈ లోకములోనికి తీసుకొనిరావడానికి మరియమాత తాను పొందబోయే అవమానమునుకాని కష్టమును కాని ఆమె పట్టించుకొనలేదు. కేవలం ప్రభువును అంటిపెట్టుకొని ఉండుటకు ఆమె ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది. యేసు ప్రభువు పసిబాలునిగా ఉన్నప్పుడు హేరోదు ఆయనను చెంపుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె యోసేపుతో కలిసి ప్రభువును కాపాడుటకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రభువును తీసుకొని సురక్షితమైన ప్రాంతమునకు పోయేది. యేసు ప్రభువును అన్ని సమయాలలో ప్రభువును గురించే ఆమె ఆలోచించేది. ప్రభువు తన ప్రేషిత కార్యం ప్రారంభించినప్పుడు ఆయన గురించి తెలుసుకొనుటకు ప్రభువు దగ్గరకు వెళుతుంది. ప్రభువు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు శిష్యులు అందరు ఆయనను వదలి వెళ్ళిపోయినా తల్లి మాత్రము ఆయనను వెంబడిస్తూనే ఉంది. సిలువ క్రింద ప్రభువు చనిపోయే సమయంలో కూడా ఆమె ఉంది. ప్రభువును ప్రతి క్షణము అంటిపెట్టుకొని ఆమె జీవించేది. అటువంటి ఆమెను యేసు ప్రభువు తాను ప్రేమించిన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. ఆయనను ఎలా ఎప్పుడు వెన్నంటివున్నదో అదే విధముగా ఆ శిష్యునికి మరియు ఆయన శిష్యులందరికి ఆమె తోడుగా,  వారి బాధలలో ఓదార్పుగా, వారికి ఆదర్శముగా ఉండుటకు ప్రభువు ఆమెను తన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. 

తల్లిగా శ్రీ సభతో మరియమాత 

మరియమాత పెంతుకోస్తు రోజున శిష్యులందరు, యూదుల భయంతో ఉన్నప్పుడు, మరియమాత వారితో ఉండి ప్రార్ధన చేస్తుంది. పవిత్రాత్మతో తిరుసభ పుట్టిన రోజన మరియమాత అక్కడనే ఉన్నది. వారితో పాటు ఉండి వారికి ధైర్యమును ఇస్తుంది.  అందరు మనలను అపార్ధం చేసుకున్నాకాని ఎలా  దైవ చిత్తమును నెరవేర్చుటకు ధైర్యంగా ఉండాలో నేర్పుతుంది. శిష్యులు భయంతో ఉన్నప్పుడు ఆమె వారికి ధైర్యమును ఇస్తుంది.  ప్రభువును పవిత్రంగా ఈ లోకమునకు తీసుకురావడానికి ఆమె కన్యగా గర్భం ధరించడానికి ఆమె ధైర్యంగా ఒప్పుకున్నది. అలానే శిష్యులు ప్రభువు అజ్ఞానుసారం జీవించేలా ఆమె ధైర్యం ఇస్తుంది. ఆమె కేవలం వారికి తోడుగా మాత్రమేకాక తన జీవితం ద్వారా ఆదర్శమును చూపిస్తుంది.  

Fr. Amruth 

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

మత్తయి 5: 20-26

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక, బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.  నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను.  

ఈ సువిశేషభాగంలో ఆంతరంగిక శుద్దిగురించి, మనం గొప్పవారిగా పరిగణించేవారి కంటే మనం మనం మంచి జీవితం జీవించాలని, సోదర ప్రేమ మరియు క్షమాగుణం కలిగి ఉండాలని, మొదట మనమే మనకు వ్యతిరేకంగా ఉన్నవారితో సఖ్యత ఏర్పరుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. 

మీ నీతి బాహ్య ఆచరణ  లేక హృదయ శుద్ధి ఆవిష్కృతమా?

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. యేసు ప్రభువు ప్రధానమైన బోధ పరలోక రాజ్యము. ఈ రాజ్యములో ప్రతివక్కరికి  శాంతి సమాధానము ఉంటుంది. ఈ రాజ్యములో ప్రవేశించడానికి ధర్మ శాస్త్ర బోధకులకంటే పరిసయ్యులకంటే నీతి వంతమైన జీవితం జీవించాలని ప్రభువు చెబుతున్నాడు.  పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నీతివంతమైన జీవితంలో ఏమైన లోపమున్నదా?  అంటే మరియొక సందర్భంలో ప్రభువు వారు చెప్పునది చెయ్యండి కాని వారు చేసేది కాదని చెప్పారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు బాహ్యంగా మంచి పేరు పొందాలనే ఆశతో అనేక ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉన్నారు కాని వారి నీతి హృదయపూర్వకమైనది కాదు, కేవలం బయట కనపడుటకు మాత్రమే చేస్తున్నారు. అందుకే ప్రభువు వారితో మీ నీతో వారికంటే గొప్పగా ఉండాలి అని చెబుతున్నారు. దీనికి మనం చేయవలసినది హృదయ పరివర్తన కలిగివుండటం. మనం చేసే పని హృదయపూర్వకంగా చేయడం. దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి. నీతి అంటే మనం చేయవలసిన పని , లేక బాధ్యతను ఖచ్చితంగా, ఎటువంటి కపటత్వం లేకుండా చేయడం. ఇందుకు మనలోని కోపం, అసూయ, మొహలను త్యజించుకోవాలి. 

నీ సోదరుని గౌరవించుట 

 "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును.  ఈమాటలు పాత నిబంధనలో ఉన్న నరహత్య చేయరాదు అనే ఆజ్ఞకు నూతన వివరణ ప్రభువు ఇచ్చాడు.  ఒక సోదరుని వ్యర్థుడా అని చెప్పిన కూడా అది నేరంగా పరిగణించబడుతుందని ప్రభువు చెబుతున్నాడు. దీనినుండి మనం ఏ వ్యక్తిని కించపరచడం లేక అవమానించడం అనేవి కూడా దేవుడు మన నుండి ఆశించడం లేదు. నరహత్య చేయువాడు తీర్పునకు గురియగును అని పాత నిబంధన చెబుతుంటే ప్రభువు సోదరుణ్ణి వ్యర్థుడా అని సంబోధించినవాడు నరకాగ్నిలో మండును అని చెబుతున్నాడు. మన సోదరులను, బంధుమిత్రులను లేక ఈ లోకంలో ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం అనేవి మనలను నరకాగ్నిలో మండేలా చేస్తాయి. మన సోదరులను గౌరవిస్తూ, మనకు సాధ్యమైనంత వరకు వారికి మంచి చేయుటకు ప్రయత్నించాలి. 

సఖ్యత కలిగి ఉండాలి

బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. ఈ మాటలు మన సోదరులతో మనకు ఉండవలసిన బాంధవ్యాలను గురించి తెలియజేస్తుంది. పవిత్ర గ్రంథంలో సహోదరుల మధ్యలో అమరికలు ఉండటం ఒకరి నాశనము మరియొకరు కోరుకోవడం ఎప్పుడు హర్షించలేదు. వారిని శిక్షించుటకు వెనుకాడలేదు. దైవ రాజ్యంలో చేరుటకు, దేవుడు మన ప్రవర్తను హర్షించుటకు మరియు మనలను శిక్షించకుండ ఉండుటకు ఏమి చేయవచ్చో యేసు ప్రభువు ఈ సువిశేషభాగంలో తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే మన సోదరులతో ఎప్పుడు సఖ్యత కలిగివుండటం. మన సోదరులకు మన మీద మనస్పర్ధ ఉందని మనకు తెలిస్తే ఆ సోదరునితో మొదటగా సఖ్యపడాలి. సఖ్యత, సమాధానం మన సోదరులతో ఎల్లపుడు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది జరిగిన తరువాతనే మనం దేవునికి అర్పించే బలి అర్పించాలని చెబుతున్నారు. అపుడు దేవునికి బలి అర్పించే సమయంలో మన మనసులో ఏ చెడు ఆలోచనకాని, అసూయకాని మనలో ఉండదు. అది మనము పరలోక రాజ్యంలో చేరుటకు అర్హతను సాధిస్తుంది. 

నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. ఏ వ్యక్తి కూడా నాశనము కావడం ప్రభువుకు ఇష్టంలేదు. కనుక యేసు ప్రభువు మనము ఏమి చేయాలో చెబుతున్నాడు. మన ప్రతివాదులతొ ముందుగానే సమాధాన పడాలి అని చెబుతున్నాడు. దాని ద్వారా మనం రానున్న శిక్షనుండి తప్పించుకొనవచ్చు. ఎల్లప్పుడూ మనం అందరితో సమాధానపడి జీవించుదాం. 

ప్రార్థన: 

ప్రభువా! మానవులు అందరు మీ రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. అందుకు మేము ఏమిచేయాలో నేర్పుతున్నారు. మా మనసు ఎల్లప్పుడు ఎటువంటి కల్మషం, అసూయా, ఇతరుల చేదు లేకుండా ఉండాలని కోరుతున్నారు.  మేము ఎటువంటి కపటత్వం లేకుండా ఉండాలని, హృదయ శుద్ధి కలిగి జీవించాలని కోరుతున్నారు. మా సోదరులలో సఖ్యత కలిగి ఉండాలని, ఎవరిని అవమానించకుండా, గౌరవించాలని నేర్పుతున్నారు. కేవలం చెప్పడమే కాక మీరు మాకు ఎలా జీవించాలో చూపించారు.  ప్రభువా మీరు చూపించిన జీవితానికి కృతజ్ఞతలు, మీ మాటలను, జీవితమును ఆదర్శముగా  తీసుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

అంత దినములు ఎలా ఉండును

 అంత దినములు ఎలా ఉండును

లూకా 17: 26-37 
నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును." "ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?" అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును" అని యేసు చెప్పెను. 

అంతదినములు ఎలా ఉండును? అని ప్రభువు ఈ సువిశేషభాగంలో చెబుతున్నారు. ఒకసారి నోవా దినములను, లోతు దినములను గుర్తు చేస్తున్నారు. నోవా రోజులలో అందరు తినుచు త్రాగుచు ఉన్నారు. అందరు వారి వారి రోజు వారి పనులలో నిమగ్నమై ఉండగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా జలప్రళయము వచ్చింది, లోతు కాలంలో ప్రజలు వారి వారి పనులలో ఉన్నారు. ఆసమయంలోనే ఆకాశం నుండి గంధకము వర్షించినది. ప్రభువు రోజు ఎప్పడు మనకు ఇష్ఠమైనపుడు, మనం కోరుకున్నప్పుడు రాదు.

 ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు. నోవా కాలంలో, మరియు లోతు కాలంలో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు. అప్పటినుండి నోవా , లోతు ఆ రోజు కోసం సిద్ధపడ్డారు. నోవా దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక ఓడను తయారు చేసాడు. మిగిలిన ప్రజలు వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు కాని ప్రభువు మాటను పట్టించుకోలేదు. నోవా మాత్రము వారితో కలవకుండా తనకు దేవుడు చెప్పినట్లుగా చేసాడు. జలప్రళయము వచ్చింది నోవా కుటుంబము మాత్రమే రక్షించబడింది. మిగిలిన వారు మాత్రము ప్రాణములను కోల్పోయారు. లోతు కాలములో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు , కాని వారు చేసే పనులలోనే వారు ఆనందం వెదుకుకున్నారు . అందరు వారి వారి పనులలో నిమగ్నం అయిపోయారు. లోతు కుటుంబము మిగిలిన వారి వలే కాకుండా జీవించడం జరిగింది. లోతు కుటుంబం రక్షించబడింది. 

దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనం సిద్ధపడాలి, అలా కాకుండా అంత సవ్యముగా ఉన్నది అనే అపోహలో ఉండి క్షమాపణ పొంది, రక్షించబడే అవకాశం కోల్పోతారు. నోవా కుటుంబం రక్షించబడింది, కాని లోతు కుటుంబంలో అందరు రక్షించబడలేదు. లోతు భార్య దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆ పట్టణమునకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంది, వెనకకు తిరుగుతుంది. ఉప్పు స్థంభం వలె మారిపోతుంది. మన కుటుంబంలో దేవుడు ప్రేమించే వ్యక్తి ఉన్నంత మాత్రమున మన కుటుంబం మొత్తం రక్షించబడాలని లేదు. ప్రతి వ్యక్తి కూడా తాను పరివర్తన చెంది మారితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. వారి కుటుంబంలో మంచి వారు ఉండటం కొంత వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది కాని వారి వ్యక్తిగత జీవితం కూడా ప్రభువు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. 

ప్రభువుని రాక సమయంలో కూడా ఇలానే జరుగును అని దేవునివాక్కు చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరు వారి వారి జీవితములను సరిచూసుకుని జీవించాలి. ఆ రోజు ఎవరు అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరి జీవితం మరియొకరి జీవితం మీద ఆధారపడి ఉండదు. ఎవరి జీవితమునకు వారే బాధ్యత వహించాలి. ఇది భయపడే రోజు ఏమి కాదు, ప్రతి నిత్యం సిద్దపడి ఉంటె అది ప్రభువు సాక్షాత్కారం అయ్యేరోజు. సరియైన సిద్ధపాటు లేకపోతే అది భయపడవలసిన రోజే అవుతుంది. 

సిద్ధపాటు 

ప్రభువు రాకడకు ఆయన అనుచరులు ప్రతి నిత్యం సిద్దమై ఉండాలి. ఎందుకు ప్రభువు రోజు కోసం ప్రతినిత్యం అప్రమత్తముగాను, సిద్ధముగాను ఉండాలి అంటే ఆ రోజు ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరు వారి వారి పనులలో ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు వస్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎవరు అయితే బద్ధులై ఉంటారో వారికి అది ఎప్పుడు వచ్చిన భయ పడవలసింది ఏమి ఉండదు. ఎందుకంటే వారు ఆ రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. జలప్రళయము వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించిన నోవా కుటుంబం రక్షించబడింది, లోతు రక్షించబడ్డాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే దానికి సిద్దపడటం. 

ప్రార్ధన : రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్

Fr. Amruth 


మార్కు 9:41-50

 మార్కు 9:41-50

మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు  సమాధానముతో ఉండుడు" అనెను.  

క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ  క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా  అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది. 

పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి  చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు.  అది నిత్యము బాధలతో ఉండే స్థితి.  నరకము అనేది దేవున్ని  తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు  పశ్చాత్తాప పడకుండా పాపములోనే  మరణించేవారు పొందే స్థితి.  నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు. 

ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే  మనము పాపము చేయుటకు మనలో  ఏదైన కారణమైతే  దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు?  ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము.  మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది.  ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి.    అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని  కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు.  మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన  మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా   చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని    చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్. 

Fr. Amruth 


మార్కు 16: 9-15

 మార్కు 16: 9-15

ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.   

ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. 

మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను
యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం. 

ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట 
దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు. 

 ఇద్దరు శిష్యులకు దర్శనం 
యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు. 

ప్రభువుని సందేశం 
యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము. క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము. అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది. 

ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని పాపము నుండి సాతాను బంధనముల నుండి విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ, మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని, మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్. 

Fr. Amruth

నిత్య జీవము ఎలా వస్తుంది

 

నిత్య జీవము ఎలా వస్తుంది

యోహాను 6: 22-29 

మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును అన్వేషించడం మరియు ఎటువంటి పరిస్థితులలో మనం యేసు ప్రభువును అన్వేషిస్తున్నాము , ఎప్పుడు ఆయనను అన్వేశించాలి , శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకొని దాని కోసమై అన్వేషించాలి అని సువిశేషం వివరిస్తుంది. 

దేవుని కోసం వెదకుట 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును వెదకుచు అనేక మంది వస్తున్నారు. వారు ఎందుకు యేసు ప్రభువును అన్వేషిస్తున్నారు ఆంటే అంతకు ముందు రోజు ప్రభువు వారి ఆకలిని తీర్చారు. కేవలం ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారమును ఇచ్చాడు. ఇతనిని అనుసరిస్తే మాకు కావలసిన ఆహరం దొరుకుతుంది అని వారు ఆయన కోసం వెతుకుచున్నారు. అంతకు ముందు వారిలో కొంతమంది వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులను చేసాడు. ఇతనిని అనుసరిస్తే మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని ఆయన కోసం వెదకుచుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎలా సాధ్యం అని తెలుసుకొనుటకు, ఆయనను అడుగుటకు వారిలో ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు ప్రభువును వెదుకుచుండవచ్చు.  ప్రభువు దేవాలయములో ఉన్న వ్యాపారులను పంపిచివేస్తున్నారు  కనుక అనేక మంది దేవుని ఆలయంలోవెళ్ళుటకు ఆవకాశం ఇచ్చాడు కనుక ఇంకా వారి అవసరాలను చెప్పుకొనుటకు ప్రభువును వెదకుచు ఉండవచ్చు. ఇతను రాజు అయితే మాకు అన్ని సమకూరుతాయి అని ప్రభువును వెదకుచు ఉండవచ్చు.  అందుకే ప్రభువు వారితో అంటున్నారు  "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు" అని అంటే మనం ప్రభువును వెదకవలసినది, అద్భుతాలు చూడాలనో, ఆహారం కోసమో కాదు. ఆయన అంతకంటే చాలా గొప్పవి ఇచ్చేటువంటి ప్రభువు. ప్రభువు తానె జీవ జలము అనే చెబుతున్నాడు. నేను ఇచ్చే జలమును త్రాగితే మరల దప్పిక కలుగదు అని చెబుతున్నాడు. నేను జీవాహారము అని చెబుతున్నాడు. నన్ను భుజించువాడు ఎన్నటిని మరణింపడు అని చెబుతున్నాడు. ప్రభువు మనకు శాశ్వతమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాటిని ఎలా పొందాలో అన్వేషించమంటున్నాడు, వాని కోసము పనిచేయమంటున్నాడు. దేవున్ని వెదకడం అంటే నిత్య జీవమును వెదకటం. అందుకే ప్రభువు చెబుతున్నాడు నేనే జీవమును అని. 

శాశ్వతమైనది- అశాశ్వతమైనది

ఇక్కడ యేసు ప్రభువు తనకోసం వచ్చిన వారితో "అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు." అని చెబుతున్నాడు.  యేసు ప్రభువు తన అనుచరులకు ఈలోక విషయములు అశాశ్వతమైనవి అని, శారీరక విషయాలు, అవసరాలు, సంపదలు  అశాశ్వతమైనవి అని చెబుతున్నాడు. అందుకే ఈలోక సంపదలు కాక పరలోక సంపదలు కూడపెట్టుకోమని చెబుతారు. "ఈలోక సంపదలు కూడపెట్టుకొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును." "నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు." ఈనాటి సువిశేషంలో మాత్రం ప్రభువు మనలను శాశ్వత భోజనముకై శ్రమించమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది పేరు ప్రఖ్యాతలు కోసం శ్రమిస్తుంటారు. అవికూడా శాశ్వతం కాదు. అప్పుడు ఏమిటి శాశ్వతమైనవి ఏమిటి అంటే  పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవి మనకు శాశ్వతమైనవి. 

శాశ్వతమైనవి అయితే అవి మనకు ఎవరు ఇస్తారు 

యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఆయన "మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును." అని చెబుతున్నాడు. ప్రభువు మాత్రమే దానిని ప్రసాదించగలరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అది ప్రసాదించే అధికారం ఉన్నది. శాశ్వతమైనవి దైవికమైనవని వారికి అర్ధం అయ్యింది. కనుక వారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని విశ్వసించండి అదే దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు. నిత్య జీవం కావాలంటే లేక శాశ్వతమైన ఆహారం కావాలంటే చేయవలసినది యేసు ప్రభువును విశ్వసించడం. యేసు ప్రభువును విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లు మారుమనస్సు పొంది,  ఆయన ఆజ్ఞలను పాటించడం. అప్పుడు మనం ఆ నిత్య జీవానికి అర్హులము అవుతాము. 

ప్రార్ధన: ప్రభువా!  మా జీవితాలలో అనేక విషయాలలో మీ సహకారం కోసం మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. అనేక సార్లు మేము మిమ్ములను మా భౌతిక అవసరములనే కోరుకుంటున్నాము. మేము ఏమి కోరుకోవాలో నేర్పించండి. మీరు చెప్పినట్లుగా శాశ్వతమైన వాటిని వెదకుచు, వాని కొరకు పాటుపడేలా మమ్ము మార్చండి. నిత్య జీవితం మీద ఆశ కలిగి, మిమ్ములను విశ్వసించి, మీ ఆజ్ఞలకు అనుకూలంగా జీవించేలా మమ్ము మార్చండి. ఆమెన్ 

Fr. Amruth 


దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?

 

దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు? 

యోహాను 3: 16-21 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు  ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై  అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక  కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను. 

ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.  

దైవ ప్రేమ 

దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని  రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు.  దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను  ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు. 

దేవుడు లోకాన్ని ఖండించడానికి  తన కుమారున్ని పంపలేదు 

దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను,  తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు.  అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు. 

విశ్వాసం యొక్క ప్రాముఖ్యత 

రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష  ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు.  ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.  

వెలుగు- చీకటి  

యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు.  కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే  సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని  వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి. 

ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ  దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్ 

Fr. Amruth 

నూతనంగా జన్మించుట

 నూతనంగా  జన్మించుట

యోహాను 3: 7-15

నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను. 

నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం 

ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది. 

ఎందుకు మరల జన్మించాలి ? 

యేసు ప్రభువు  ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన  వ్యక్తులు,  ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని  రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు. 

ఆత్మతో జన్మించువారు 

ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి  ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి.  వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు. 

యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట 

యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి.  ఆయనను వేదకాలి అటువంటి  వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు. 

పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి. 

యేసు ప్రభువు ఎత్తుబడుట 

పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని  రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ  ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు. 

ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్ 

Fr. Amruth 

నీటివలన ఆత్మ వలన నూతన జీవం

  నీటివలన ఆత్మ వలన నూతన జీవం 

యోహాను 3:1-8


పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి "బోధకుడా! నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు" అని పలికెను. యేసు అందుకు అతనితో, "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని పలికెను అందుకు నికోదేము, "వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా?" అని అడిగెను. అపుడు యేసు,"ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది. నీవు మరల జన్మింపవలయునని  నేను  చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. 

వెలుగు దగ్గరకు వచ్చుట 

  
యేసు ప్రభువు వద్దకు నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే నికోదేము ఒక పరిసయ్యుడు, మరియు బోధకుడు. ఒక బోధకుడు మరియు పరిసయ్యుడు అయిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు అంటే బోధకులు మరియు పరిసయ్యులు అతనిని తక్కువ చేసి చూడవచ్చు, లేక ప్రభువుతో మాటలాడి ఆయనను అంగీకరిస్తే ఖచ్చితముగా నికోదేము ఇతర వారితో అవమానింప బడవచ్చు. అందుకే కాబోలు నికోదేము ఎవరి కంట పడకుండ రాత్రి వేళ వచ్చి ఆతనికి ప్రభువు చెప్పేదేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని వచ్చి ఉండవచ్చు. ఇక్కడ రాత్రి వేళ ప్రభువు దగ్గరకు రావడం అంటే చీకటి నుండి వెలుగు దగ్గరకు రావడం. ప్రభువు అనేక సార్లు నేనే వెలుగు అని చెబుతారు. ఇప్పుడు నికోదేము చీకటిని వదలి వెలుగు దగ్గరకు వచ్చి తనలో ఉన్న అంధకారాన్ని మొత్తంను వెలుగుతో నింపుకొనుటకు అవకాశము వచ్చి నందున దానిని పూర్తిగా వినియోగించుకొంటున్నాడు. తనలో ఉన్న ప్రతి అనుమానాన్ని ప్రభువు ముందు వెల్లడిచేస్తున్నాడు. 

ప్రభువు గొప్పతనాన్ని  ఒప్పుకొనుట 


నికోదేము స్వయంగా బోధకుడు కనుక అతనికి దేవుని గురించి దైవ జ్ఞానము గురించి అవగాహన ఉంది. యేసు ప్రభువు మాటలు విన్నప్పుడు అతనిలో ఉన్న దైవ అన్వేషణ, ప్రభువు వద్ద నుండి ఇంకా  దేవుడిని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ అయ్యింది. ప్రభువు ఎక్కువగా దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నారు. మానవుడు ఏమి హెచ్చించి అయ్యిన ఆ దైవ రాజ్యం పొందాలనే కోరిక ఎక్కువైంది, మరియు తనలో ఉన్న కొన్ని అనుమానాలు కూడా తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు దేవుని నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు, లేనిదే ఈ అద్భుత కార్యములు ఎవరు చేయలేరు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభువు చేచేసిన అద్భుతాలు సాధారణమయినవి కావు.  ఆయన పకృతి మీద, లోకం మీద జీవరాశుల మీద తన ఆధిపత్యాన్నే కాక ఎలా ఒక దానిని సహజ సిద్ద స్వభావాలు కూడా మార్చ గలిగాడో తెలుసుకున్నాడు. కనుకనే ఎవరు దేవుని నుండి రాకపోతే మీలా చేయజాలరు అని ప్రకటిస్తున్నాడు. 


నీటివలన ఆత్మవలన పుట్టుట 


యేసు ప్రభువును నికోదేము నీవు దేవుని నుండి వచ్చావు అని ప్రకటించిన తరువాత ప్రభువు నీకొదేముతో ఏ విధంగా  దేవుణ్ణి చేరవచ్చు, అతనితో ఉండవచ్చు, అతనిని పొందవచ్చు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అది ఎలా అంటే "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని ప్రభువు పలుకుతున్నాడు. దానికి నీకొదేము మరల జన్మించడము అంటే తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టడం ఎలా అని అనుకుంటున్నాడు. దానికి ప్రభువు మనిషి మరల జన్మించడం అంటే నీటి వలన ఆత్మ వలన అని చెబుతున్నాడు. నీరు పరిశుద్దతను సూచిస్తుంది. మనిషి తన మలినాన్ని కడుగుకొనవలెను అని చెబుతుంది. ఇది జ్ఞానస్నానమును సూచిస్తుంది. అందుకే ప్రభువు తన శిష్యులతో మీరు వెళ్లి పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానము ఇవ్వమని చెబుతున్నారు. ఆత్మ జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని నిలుపుతుంది. దేవుని ఆత్మ మాత్రమే మనకు  నూతన జీవితాన్ని ఎప్పుడు పడిపోకుండా ఉంచుతుంది.  

ఆత్మను గుర్తించగలుగుట 


ఆత్మను ప్రభువు గాలితో  పోల్చుతున్నాడు. గాలిని మనం అనుభవించగలము కాని అది ఎక్కడ నుండి వస్తున్నదో, ఎక్కడకు వెళ్తుందో మనకు తెలియదు అటులనే ఆత్మ నుండి పుట్టినవాని జీవితంలో వచ్చిన మార్పును మనము గుర్తించగలం, ఎందుకంటే వారి జీవితం అంతలా మారిపోతుంది. మనము కూడా ప్రభువు చెబుతున్న ఆ దేవుని రాజ్యంలో చేరుటకు, మరల జన్మించుటకు బాప్తిస్మము పొందియున్నాము. నూతన జీవితము జీవించుటకు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. 

ప్రార్ధన: ప్రభువా ! మీ వద్దకు రావడం అంటే వెలుగు దగ్గరకు రావడమే, జీవం వద్దకు రావడమే, మీజీవితంలో అనేక అంధకార శక్తులు ఉన్నవి వాటి అన్నింటిని వదలి మీ దగ్గరకు రావడానికి, మరియు మీరు చెబుతున్న ఆ దైవ రాజ్యంలో స్థానము పొందుటకు సహాయం చేయండి. నిజమైన సంపదను తెలుసుకొని, దాని కోసం పాటుపడేలా చేయండి. జ్ఞానస్నానం పొందిన మీ అనుచరులుగా జీవించ శక్తిని దయచేయండి. ఆమెన్ 

Fr. Amruth 





లూకా 5: 33-39

  లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము త...