18, జనవరి 2026, ఆదివారం

యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18

 

యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18  

యేసు అటనుండి  తూరు , సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్లెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, "ప్రభూ! దావీదుకుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపచుచున్నది" అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్కమాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి "ఈమె మన  వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు"  అనిరి. "నేను యిస్రాయేలు వంశమున చెదిరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని" అని ఆయన సమాధానము ఇచ్చెను. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి "ప్రభూ! నాకు సాయపడుము"అని ప్రార్ధించెను. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపుబల్ల నుని క్రింద పడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. యేసు ఇది విని "అమ్మా!నీ విశ్వాసము మెచ్చదగినది. ఈ కోరిక నెరవేరునుగాక!" అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. 

ప్రియమైన దైవ ప్రజలారా ఈనాటి పఠనాలలో ప్రభువైన దేవుడు నేను మీ అందరికి దేవుడును, నేను మిమ్ము కరుణింతును. నేను మీకు దర్శనమిచ్చితిని. నేను మిమ్ము శాశ్వతమైన, నిత్యప్రేమతో  ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. మిత్రులారా దేవుడు చెప్పే ఈ మాటలకు మనము ఏమి చేయాలి అంటే మనము మన దేవుడైన ప్రభుని చెంతకు రావాలి. ప్రభువు చెంతకు వచ్చి ఏమి చెయ్యాలి? అంటే దేవుని గొప్ప కార్యములను  ఆయన చేసిన మేలులను గుర్తించి మనలను రక్షించినందుకు ధన్యవాదములు చెల్లించి, స్తుతిగానము చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియవిశ్వాసులారా నీవు నేను మన దేవుణ్ణి మన దేవునిగా అంగీకరిస్తున్నామా? లేదా లోకంలోని వ్యక్తులను , పదవులను డబ్బును సంపదను లేదా మన కోరికలను అనుసరించి దేవుని మర్చి పోతున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము  ప్రార్ధిస్తామో ప్రభువు కరుణామయుడు కనుక మనలను ఖచ్చితముగా కరుణిస్తాడు. మనము పవిత్ర గ్రంధంలో చూస్తే, మమ్ము కరుణించు అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కరుణించాడు. ఆయన కరుణకు హద్దులు లేవు. ఓక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా దేవుడు మనలను తన శాశ్వతమైన నిత్యా ప్రేమతో ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మరి మనము దేవుని శాశ్వత ప్రేమను అర్ధం చేసుకుంటున్నామా! దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? లేదా ఈ లోక సంపదలను ఈ లోక వస్తువులను, ఈ లోక పదవులను ఈ లోక ఆకర్షణలు ప్రేమిస్తున్నామా ఆలోచించండి. 

ఈనాడు సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును  ఒక తల్లి తన బిడ్డను రక్షించండి అని వచ్చినప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. తల్లి తన బిడ్డకై పడిన వేదనను కష్టాన్ని విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యం చేసున్నాడు. కననీయ స్త్రీలో ఉన్నా విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఆమె వలే మనము దేవుణ్ణి పిలవాలి. ఆమె దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణింపుము అని ప్రార్ధించింది. మరి  మనము ఆ తల్లి వలె మన మన తల్లి దండ్రుల కోసం, బిడ్డల కోసం మన కుటుంబం కోసం మన  సంఘం కోసం ప్రార్ధన చేస్తున్నామా లేదా? కొన్ని సార్లు దేవుడు కుడా  మన వేడుకోలు పట్టించుకోవడం లేదు అని చాలా మంది ప్రార్ధన చేయడం, దేవాలయానికి వెళ్లడం మానివేస్తారు, ఈనాటి సువిశేషం ద్వారా మానమ్  గ్రహించవలసినది ఏమిటంటే మనం విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో, దేవా మమ్ము కరుణించును అని మనం    ప్రార్ధన చేస్తే  దేవుడు  ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యలు మన జీవితంలో తప్పకుండ చేస్తాడు. మరి మనము ఏమి చేయాలంటే  దేవుడ్ని చెంతకు రావాలి, ప్రార్ధించాలి. అలాగే ఆయన చేసిన మేలులకు స్తుతిగానం చెయ్యాలి. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీ ప్రేమ శాశ్వతమైనది. నీ కరుణ ఎల్లలు లేనిది. మేము నీ శాశ్వతమైన ప్రేమను తెలుసుకూన్ నీ ప్రేమను అనుభవించి నీ కరుణను పొంది నీ ప్రేమలో జీఇవస్తు నీ దయను పొందుతు, నిన్ను స్తుతిస్తూ ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ . 

ఫా . సురేష్ కొలకలూరి OCD

15, జనవరి 2026, గురువారం

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23

 

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23 

తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన  శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. "మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?" అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును." ఇట్లు చెప్పి, తాను  క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలవలన , ప్రధానార్చకులవలన , ధర్మ శాస్త్ర బోధకులవలన పెక్కుబాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, "ప్రభూ ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక !" అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో "ఓ సైతాను! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధిచినవే, కాని  దేవునికి సంబంధిచినవికావు" అనెను

క్రిస్తునాధుని ప్రియ మిత్రులారా, ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన ప్రజలతో  ఒక నూతన నిబంధము చేసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడని అదే విధంగా ఆ నిబంధన  తాను మన పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు  చేసుకొనిన నిబంధన వంటిది కాదు అని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే 'నేను మీ దేవుడనైన ప్రభువును-మీరు నా ప్రజలు' నేను మీ కాపరిని మీరు నా మంద అని ప్రభువు మన పితరులతో నిబంధన చేసుకున్నాడు. మరి ఎందుకు దేవుడు మరల ఒక నూతన నిబంధనము మనతో చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, మన పితరులు, పూర్వికులు  ప్రభువును ఆయన చేసిన గొప్ప అద్భుతకార్యాలను  తమ కన్నులార చూచి అనుభవించి కూడా ప్రభుని యొక్క నిబంధనను మీరారు. అన్యదైవములను కొలిచి తమ జీవితాలలో అనేక తప్పులు చేసుకుంటూ దేవుణ్ణి విడనాడి పాపము చేస్తూ పాప మార్గములలో ప్రయాణించారు. దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రమును విడనాడారు. తమ నాశనమును తామే కొనితెచ్చుకున్నారు. 

మరి నూతన నిబంధన ఏమిటి అంటే మనము కూడా మన పూర్వికులలాగా, మన పితరుల వలె దేవుణ్ణి దైవ శాస్త్రాన్ని ఆయన చేసిన నిబంధనను మర్చిపోయి జీవిస్తున్నామా?  దేవుడు చెప్పినట్లుగా దైవ ప్రజలలాగా మంచి పనులు చేయలేకపోతున్నాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వలేక పోతున్నాం. అందుకే దేవుడు మనందరితో నూతన నిబంధన చేస్తున్నాడు. అది ఏమిటంటే "నేను నా ధర్మ శాస్త్రాన్ని వారి అంతరంగమున ఉంచుదును. వారి హృదయాలపై లిఖింతును. అల్పులు అధికులెల్లరు నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును దానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను అని దేవుడు అంటున్నాడు. మరి మనము దేవుని ధర్మ శాస్త్రాన్ని మన హృదయాలలో పదిల పరుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ, దైవ ప్రజలుగా జీవించాలి. జీవించడానికి ప్రయత్నించాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? అప్పుడు పేతురు యేసు ప్రభువుతో " నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిస్తున్నాడు. ఈ విషయమును పేతురుకు  బయలు పరిచినది, పరలోకమందున్న తండ్రి దేవుడు. ప్రియ మిత్రులారా అదే ప్రశ్న దేవుడు ఈనాడు మనలను అడుగుతున్నాడు. మన సమాధానము ఏమిటి ? యేసు క్రీస్తుని గురించి నీ అనుభవం ఏమిటి? మనం క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాము ? చాలా మంది పునీతులు క్రీస్తును, ఆయన కార్యములను చూసి కొంతమంది నా తండ్రి అని, కొందరు నా రక్షకుడు అని , కొందరు నా కాపరి అని  ఎన్నో భావాలు చెబుతుంటారు. క్రీస్తుని యెడల నీ భావం ఏమిటి? నీ అనుభవం ఏమిటి? నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నేను నిజంగా క్రీస్తుని అనుభవిస్తున్నానా ? లేదా? ఆత్మా పరిశీలన చేసుకుందాం. దేవున్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : ప్రభువైన దేవా! మేము మిమ్ము మా ప్రభుడవని గుర్తించుకొని మీ  ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ-మీతో మేము చేసుకొనిన నిబంధమును ఎల్లవేళలా గుర్తించుకొని మీ  ప్రజలలాగా జీవించడానికి, మిమ్ము  తెలుసుకోవడానికి అదేవిధంగా మీ  ధర్మ శాస్త్రాన్ని మా హృదయాలలో పదిల పరుచుకోవడానికి మాకు మీ కృప వరములను దయచేయండి. తద్వారా మేము మిమ్ము తెలుసుకొని, ప్రేమించి సేవించుదుము. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28

 

నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28  

"నన్ను అనుసరింపగోరువాడు తననుతాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచు వాడు దానిని పోగొట్టుకొనును. నా  నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు పలికెను. 

క్రిస్తునాధుని యందు ప్రియ స్నేహితులారా ఈనాడు కార్మెల్ సభకు ఎంతో  పర్వదినం. కార్మెల్ సభ సభ్యులు ఎంతో సంతోషంగా పునీత ఎడిత్ స్టెయిన్ గారి పండుగను జరుపుకుంటారు.

ఆమె జీవితం: పునీత  ఎడిత్ స్టెయిన్ గారు అక్టోబర్ 12 వ తేదీన 1891వ సంవత్సరంలో జన్మించారు. చిన్న వయస్సు నుండి ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తి.  ఆమె హెడ్మాన్డ్ హస్రెల్ అనే గొప్ప తత్వవేత్త శిష్యురాలు. ఆమె కూడా త్తత్వవేత్తగా ప్రసిద్ధి చెందినవారు. 1904వ సంవత్సరంలో తనను తాను  నాస్తికురాలిగా ప్రకటించుకుంది. కాని కాలక్రమేణా ఆమె గొప్ప జ్ఞానము కలిగిన విద్యార్థిగా , మరియు కళాశాల ఆచార్యరాలుగా గొప్ప మేధాసంపద కలిగిన వ్యక్తిగా మారింది. ఆమె 1921లో అవిలాపుర  తెరాసమ్మ గారి జీవిత కథను,  ఆత్మకథ పుస్తకం చూసి రాత్రికి రాత్రే ఆ పుస్తకాన్ని చదివి, ఆమె సత్యాన్ని కనుగొన్నది. ఆమె సత్యం కోసం అన్వేషిస్తుంది.  తెరెసామ్మ గారి ఆత్మకథ ద్వారా క్రీస్తు ప్రభువు సత్యం అని కనుకొన్నది. ఆమె కార్మెల్ సభకు ఎంతో ఆకర్షితురాలైంది. 1982లో యూదా మతం నుండి  కాథోలికురాలిగా మారింది. తదనంతరం ఆమె 1933లో కొలోన్లోని కార్మెల్ మఠంలో చేరింది. కార్మెల్ మఠంలో సిలువ తెరెసా బెనెడిక్తగా పేరును స్వీకరించింది. ఈ పేరుకు అర్ధం తెరెసా సిలువ ద్వారా ఆకర్షించబడింది అని అర్ధం. ఎడిత్ స్టెయిన్ గారు తన గొప్ప రచనల ద్వారా ఎన్నోసత్యాలను ప్రజలకు తెలియజేసినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువుని  కోసం, క్రీస్తు ప్రభునిపై తనకు ఉన్న ప్రేమకోసం తన విశ్వాసాన్ని వదలక ఎన్నో కష్టాలను బాధలను ఏంతో సంతోషంతో ఎదుర్కొవడానికి, క్రీస్తు కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి, సత్యం కొరకు సాక్షిగా నిలబడింది,ఈ గొప్ప పునీతురాలు. ఆమె ఆగస్టు 9, 1942 వ సంవత్సరంలో వేదసాక్క్షి మరణం పొందింది.  

ఈనాటి మొదటి పఠనంలో యూదా ప్రజలకు శుభ వర్తమానమును ఈ విధంగా  వినిపిస్తున్నాడు. దుష్టులు మీపై మరల దాడి చేయరు. వారు  ఆడపొడ కానరాకుండా పోవుదురు. అదేవిధంగా మీకు మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పుదును. మరి మనము శుభ వర్తమానము వినగలుగుతున్నామా, దేవుడు మనలను రక్షిస్తున్నాడు. మనకు  వైభవమును ఇస్తున్నాడు. దానిని మనము నిలుపుకోగలుగుతున్నామా? ఆలోచించండి. మనము దేవునికి దూరంగా వెళ్లిన  , ఆయనను బాధపెట్టిన,  ఆయన మాత్రం మనలను వదలి పెట్టరు. అదేవిధంగా విశ్వాస పాత్రంగా మనము కూడా జీవించాలి. 

ఈనాడు సువిశేషం  "పునీత ఎడిత్ స్టెయిన్ గారి  జీవితంలో అక్షరాల నెరవేరింది. అదేమిటంటే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు "నన్నుఅనుసరించగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను." పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తును తెలుసుకొని తనను తాను పరిత్యజించుకొన్నది. తన జీవితంలో వచ్చే శ్రమలను బాధలను కష్టాలను ఇబ్బందులను మోస్తూ సిలువను  ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అనుసరించింది. క్రీస్తు ప్రభువుని అడుగుజాడలలో నడిచి ఆయన సాక్షిగా మారింది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నా నిమిత్తము ఎవరైతే  తమ ప్రాణాలను ధారా పోస్తారో వారు తమ ప్రాణాలను దక్కించుకొందురు అని అన్న మాటను నెరవేర్చింది. ఈలోకం మొత్తం పంపాదించి తమను కోల్పోతే లాభము ఏమిటి అనే సత్యాన్ని తెలుసుకొని తనను తాను  దేవునికిసమర్పించుకుంది. వారి వారి పనులను బట్టి దేవుడు  ప్రతిఫలాన్ని ఇస్తాడని మనము విన్నాం.  ఆమె చేసిన గొప్ప పని ఏమిటంటే తాను సత్యాన్ని  తెలుసుకొని సత్యస్వరూపుడైన  క్రీస్తుని అనుసరించింది. అంతేకాక క్రీస్తుని కొరకు తన ప్రాణమును దారపోసింది. ప్రభువు చెప్పినట్లుగా ఆమె క్రియలను బట్టి ఆమె విశ్వాసాన్నిబట్టి ఆమె తిరుసభలో ఒక గొప్ప పునీతురాలుగా మారింది. మరి మనము నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామా!మనల్ని మనము పరిత్యజించు కొంటున్నామా? మన సిలువలు అనే బాధలు కష్టాలను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నామా, ఈ  కాలంలో చాలా మంది క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. కాని తమను తాము ప్రరిత్యాజించుకోలేక పోతున్నారు. కేవలం నామ మాత్రంగా అనుసరిస్తున్నారు. ఆలోచించండి, మనము ఎలా ఉన్నాం? లోక సంపదలతో  మన ఆత్మను కోల్పోతున్నాము. కాబట్టి ప్రియాబిడ్డలారా పునీత ఎడిత్ స్టెయిన్ గారి వలె జీవిస్తూ ఆమె వలె గొప్ప కార్యాలు చేస్తూ క్రీస్తు ప్రభుని నిజమైన అనుచరులుగా జీవించుదాం. 

ప్రార్ధన : ఓ ప్రభువా మీరు మాకు ఎన్నోసార్లు నీతి మార్గంలో నడవమని పిలుపు ఇస్తున్నారు. కొన్ని  సార్లు మమ్ము మేము పరిత్యజించుకోలేక పోతున్నాం. మా సిలువను మోయలేక పోతున్నాం. మా సిలువలు అనే బాధలతో  నిన్ను అనుసరించలేక పోతున్నాం. కాని తండ్రి! భయంతో , దురాలోచనలతో లోక సంపదలతో పడి మా ఆత్మలు కోల్పోతున్నాము. ప్రభువా మంచి క్రియలద్వారా విశ్వాసంతో మిమ్ము అనుసరించి మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యోహాను 12: 24-26

 

యోహాను 12: 24-26    

 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన:గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించును. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును. 

ధ్యానము: ఈరోజు మనము  పునీత లారెన్స్ గారి మహోత్సవమును జరుపుంటున్నాము. ఎవరు పునీత లారెన్స్ గారు అంటే యేసు ప్రభువు వలే జీవించడానికి ఆయన నిజ అనుచరునిగా జీవించిన వ్యక్తి. ఆయన 32 సంవత్సరాల వయసులో మరణించాడు. రోమపుర ఆర్చ్ డికనుగా సేవ చేసాడు. యేసు ప్రభువు మరణించిన రెండువందల సంవత్సరాల తరువాత ఈయన జీవించాడు. ఆనాటి రోజులలో తిరుసభకు స్వతంత్రం లేదు, తిరుసభ మొత్తం  రహస్యంగా దేవుణ్ణి ఆరాధించారు. క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎంతో గోరంగా హింసించారు అంటే కొంత మందిని మంటలలో కాల్చారు. కొంతమందిని అడవి మృగాలకు  ఆహారంగా ఇచ్చారు. కొంతమందిని నూనెలో కాల్చారు. క్రైస్తవుల మీద హింస వలేరియన్, డైక్లిషియన్లు చక్రవర్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది.  వలేరియన్ చక్రవర్తి  మేత్రానులను , గురువులను, డికనులను చంపాలి అని శాసనము చేసాడు. 258వ సంవత్సరంలో సిక్స్టాస్ పోపుగారిని బంధించారు. ఆది చూచిన  లారెన్స్ పోపుగారి వెంట వెళుతూ నన్ను వదలి ఎలా వెళతారు తండ్రిగారా అని అడిగితే ఆ పోపుగారు లారెన్స్ తో, కుమారా నేను నిన్ను వదలి పెట్టను, నీకు ఎక్కువ హింసలు రాబోతున్నవి.   నీవు ఇంకా ఎక్కువుగా ప్రభువుకు సాక్షమివ్వడానికి వస్తావు అని చెప్పాడు. కనుక లారెన్స్ గారికి వచ్చేటువంటి హింస ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు.  

లారెన్స్ రోమాపూరి ఆర్చి డికను, రోమా పూరి తిరుసభ   సంపదమొత్తం లారెన్స్ ఆదీనంలో ఉన్నది.  లారెన్స్ ఆ సంపదను పేదలకు పంచుతూ ఉండేవాడు.  అప్పుడు ఆ సంపదను అక్కడి అధికారులు కావాలని అడిగినప్పుడు లారెన్సు వారిని  మూడు రోజులు సమయం అడిగి,  ఆ సమయంలో ఆ సంపదను మొత్తాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. తరువాత  రోములో ఉన్న పేదలను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇదే తిరుసభ సంపద అని వారి ముందు ఉంచాడు.  లారెన్స్ గారికి తనకు ఏమి జరుగుతున్నదో ఖచ్చితముగా తెలుసు. అయినప్పటికి అతనికి ఎదురయ్యే సమస్యలను హింసను పట్టించుకోకుండా, యేసు ప్రభువు నిజమైన అనుచరునిగా ఉండటానికి సిద్ధపడ్డాడు. 

ఆది మొత్తం పరిశీలిస్తున్న అధికారి లారెన్స్ గారిని బంధించాడు. ఆయన్ను ఒక మాంసపు ముక్కను నిప్పుల మీద కాల్చినట్లు ఒక ప్రక్క కాల్చగా, నేను ఈ ప్రక్కన కాలిపోయాను, ఇప్పుడు అవతలి ప్రక్కన కాల్చమని అడిగాడు. వారు అటులనే వేరొక ప్రక్కన కాల్చడం జరిగినది. ఎంతటి బాధనైనా తట్టుకోవటానికి పునీత లారెన్స్ గారు సిద్ధపడ్డాడు. తాను పొందే హింస తక్కువ అన్నట్లు హింసించే వారిని ఇంకా ఎక్కువగా హింసించేలా ప్రేరేపించాడు. వారితో పరిహాసం ఆడాడు. అయన దృష్టిలో  యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. వారు పెట్టె హింసలు చాలా కఠినమైనవి ఐన ప్రభువు సాక్షిగా నిలబడటానికి ఆనందంగా వాటిని భరించాడు అవి ఆయనకు అల్పమైనవిగా కనపడినవి. ప్రభవు మీద అతని ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువు అనుచరునిగా జీవించాడు. అందుకే పునీత లారెన్స్ గారు హాస్య కళాకారులకు పాలక పునీతునిగా ప్రసిద్ధి. 

ఈనాటి సువిశేషంలో ప్రభువు తన అనుచరుల లక్షణాల గురించి చెబుతున్నాడు. గోధుమగింజ భూమిలో పడి నశించనంతవరకు అది ఫలించదు. అంటే నేను నా బాహ్య పొరను వదిలించుకొని రావాలి అప్పుడు మాత్రమే నేను పూర్తిగా ఫలించడానికి సిద్దము అవుతాను. ఏమిటి ఈ బాహ్యపొర ఎలా దానిని నేను కోల్పోవాలి? ప్రభువే నాకు అది నేర్పుతున్నారు. ఎలా నన్ను నేను రిక్తుని చేసుకోవాలో చెబుతున్నాడు. నెను ఈ లోక జీవితం నాకోసము కాదు, ఈ లోకంలో నేను కేవలం నాకోసమే జీవించినట్లయితే  నా జీవితం  ఫలించదు. ఈ జీవితంలో నన్ను నేను ఇతరుల కోసం ఇవ్వాలి. యేసు ప్రభువు వలె జీవించాలి. ఆయన తన ప్రాణమును, తన సమయాన్ని, తన శక్తిని, తన యుక్తిని, తన జీవితాన్ని మన కోసం హెచ్చించాడు. తన ప్రాణమును కూడా కోల్పోయాడు కాని తండ్రి ఆయనకు తన ప్రాణమును ధారపోయుటకు మరల తీసుకొనుటకు అధికారం ఇచ్చాడు.

ఈ లోకములో తన జీవితమే ముఖ్యం, తన ప్రాణమే ముఖ్యం అనుకునే వారు అందరు స్వార్ధంతో జీవించువారే, వారు దేవుని అనుగ్రహములను కోల్పోతున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లు జీవిస్తే ఆయనతో పాటు మనము ఉండవచ్చు. యేసు ప్రభువుతో పాటు ఉంటే తండ్రి దేవుడే మనలను గౌరవిస్తారు. యేసు ప్రభువును అనుసరిస్తూ, నన్ను నేను కోల్పోయిన నాకు లాభమే. ఎందుకంటే పరలోకమున నేను నా ప్రాణమును పొందుతాను. మరల ప్రభువుతో కలసి ఉంటాను, ఈ మహాద్భాగ్యం ఏమిచ్చి నేను పొందగలను. కేవలము ఆ ప్రభువును అనుసరించుటం వలన మాత్రమే. అంతే కాదు అప్పుడు తండ్రి దేవుడు నన్ను గౌరవిస్తారు అని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : సకల వర ప్రధాత అయిన ప్రభువా! నేను నా జీవితములో ఉహించలేనటువంటి గొప్ప అనుగ్రహాలు నాకు దయచేసి ఉన్నారు.  మీరు వాగ్దానము చేసిన వాటిని పొందుటకు నాకు అర్హత లేదు ప్రభువా కాని , పునీతుల జీవితాలు చూసినప్పుడు నేను కూడా అలా జీవించాలి అనే కోరిక నాలో కూడా పుడుతుంది, వారి వలె మిమ్ములను సంపూర్ణంగా అనుసరించే అనుగ్రహం దయచేయండి. మిమ్ములను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ మీతో ఉండే అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ  దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు. 
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు? 
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన  తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు.  ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు. 
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. 
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు. 
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు. 
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

2, ఆగస్టు 2024, శుక్రవారం

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12 (3 ఆగస్టు 2024)

ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి. 

ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే  పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష  విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు. 

సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని  భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది. 

హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం  తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన   సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున  ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం  దయ చేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యిర్మీయా 26:1-9 మత్తయి 13: 54-58

యిర్మీయా 26:1-9  మత్తయి 13: 54-58    2 ఆగస్టు 2024

యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్ధనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, "ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటినుండి  లభించినవి?" అని అనుకొనిరి. "ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు  , యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా? ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు యితడు ఎట్లు పొందెను?" అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో  "ప్రవక్త  స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు" అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. 

ఈనాడు ప్రభువు తన వాక్కును యిర్మీయా ప్రవక్తకు, నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాటిలో ఒక్క మాటకూడా వదలిపెట్టవలదు అని  వినిపించాడు.  ప్రియా మిత్రులారా దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని , తన వాక్కును వినిపించి, తనను ఆరాధించే ప్రజలకు తన సందేశాన్ని ఒక్క మాటకూడా వదలి  పెట్టకుండా చెప్పడానికి మన మధ్యకుపంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు అంటే, దేవుని వాక్కును సందేశాన్ని విని పాపులమైన మనము  మన దుష్ట మార్గము నుండి మంచి మార్గములోనికి రావాలని, మన బ్రతుకులు మార్చుకొవాలని, మనము  మనం పాపలు నుండి చేదు వ్యసనాల నుండి మారకపోతే  దేవుని ప్రేమకు దగ్గరగా రాకపోతే మనం నాశనమునకు గురిచేయబడుతాం. మారుమనస్సు పొందితే రక్షణ లేకపోతే నాశనము. మరి మనము మన మనస్సును మార్చుకోవాలంటే ఏమి చేయాలి.

యిర్మీయా 26:4 వ వచనంలో దేవుడు "మీరు నేనిచ్చిన ధర్మ శాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలి"  అని చెబుతున్నాడు. మరి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆజ్ఞలు అన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమపై ఆధారపడియున్నవి. మరి మనము దేవుని మరియు మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? అదేవిధంగా దేవునికి నిజంగా విధేయులమై ఉంటున్నామా? మనం ఎవరికీ విధేయత చూపిస్తున్నాం? దేవుని వాక్కులుకు విధేయత చుపిస్తున్నామా? ఒకవేళ దేవుని వాక్కు కు విధేయత చూపించకపోతే మనము మన నాశనమును  కోని తెచ్చుకుంటాము. దేవుడు యిస్రాయేలు ప్రజలతో , మీరు నా సేవకులగు ప్రవక్తల  పలుకులు వినలేదని అంటున్నాడు.  మరి ఈనాడు మనం దేవుని సేవకులగు ప్రవక్తలు,   గురువులు పెద్దల మాటలను వింటున్నామా  లేదా ఆలోచించండి. ఒక ప్రవక్తగా, దైవ సేవకునిగా, దేవుని వాక్కును భయపడకుండా, భాధలకు దూరంగా వెళ్లకుండా  ధైర్యంగా ప్రకటించాలి. యిర్మీయా ప్రవక్త వలె ఉండాలి.   ఆయన దేవుని వాక్కును, సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆయనను నింధించారు. ఆయనపై అరిచారు. కాని  ఆయన దేవుని వాక్కును, సువార్త పరి చర్యను ఆపివేయలేదు. 

ఈనాటి సువిశేషంలో తన పట్టణ ప్రజలే క్రీస్తు ప్రభువునుతృణీకరించారని వింటున్నాం. ఆయనను చిన్న చూపు చూచి, ఆయన బోధనలు విని ఆశ్చర్యపోయి, క్రీస్తు ప్రభువునికి ఇంతటి  జ్ఞానం ఎట్లు వచ్చినదని,  ఆయనను ఔన్నత్యాన్ని ఒప్పుకోలేక,  ఆయన బోధనలను తృణీకరించారు. క్రీస్తు ప్రభువు, తన శిష్యులమైన  మనకు  తెలియజేసేది ఏమిటంటే మనవారే కొన్ని  సార్లు మనలను తృణీకరిస్తారు , మన మాటలను అంగీకరించరు, మన మాటలపై అవిశ్వాసం వ్యక్తపరుస్తారు, భయపడకండి, నా సందేశాన్ని అందరికి తెలియజేయండి. కొన్నిసార్లు అగౌరవంగా మాట్లాడుతారు. కాని  మీరు సువార్త ప్రకటనను కొనసాగించండి అని తెలియజేస్తున్నాడు. 

ప్రార్థన : 
ప్రేమమయుడైన  దేవా! నీవు మమ్ము రక్షించువాడవు. మేము నీ వాక్కును విని, ఆరాధిస్తూ, నీ ఆజ్ఞలను పాటించి జీవించే భాగ్యం  నాకు దయజేయండి. తద్వారా మేము మా దృష్టమార్గములను విడిచిపెట్టి, నీ ప్రేమా ,  సువార్తను  ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. మమ్ము ఎవరు తృణీకరించిన బాధపడకుండ,  నీ సత్య మార్గములో నడిచే శక్తిని ఇవ్వండి.   ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

31, జులై 2024, బుధవారం

మత్తయి 13: 47-53

 మత్తయి 13: 47-53 (1.ఆగస్టు 2024)

"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కోరుకుకొందురు." వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?" అని యేసు అడిగెను. "అవును" అని వారు సమాధానమిచ్చిరి. అయన "పరలోక రాజ్యమునకు శిక్షణ  పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" అనెను. 

ఈరోజు దేవుని వాక్యం మొదటి పఠనమును  మనము చూస్తే,  దేవుడు యిర్మీయా ప్రవక్తను ఓక  కుమ్మరి వాని ఇంటికి తన యొక్క సందేశాన్ని వినిపించమని పంపిస్తున్నాడు,  అయితే ఆ ప్రవక్త  వెళ్లి ఆ కుమ్మని సారెమీద పని చెయ్యడం చూసాడు. దేవుడు ఎన్నో  సార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన  దగ్గరకు పంపిస్తునాడు. మన  గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపించుచున్నాడు. ఎందుకు అనగా మనయొక్క జీవిత విధానాలను చూచి, మన  వ్యాధి బాధలను చూచి మనలకు సువార్తను అంటే, దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను పంపుచున్నాడు. 

ఆనాడు యిర్మీయా ప్రవక్త కుమ్మరివాని  ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూచి ఉన్నాడు. మనము ఈనాడు ఏ పనులు చేస్తున్నాము. దానిని బట్టి దేవుడు తన సందెశాన్ని మనకు అందిస్తాడు. కుమ్మరి,  సరిగా తయారుకాని కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రగా చేసాడో అదే విధంగా  దేవుడు కూడా మన జీవిత విధానం బట్టి, మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండా మరల ఏ విధంగా అందమైన పాత్రగా మార్చుబడుతుందో, దేవుడు పాడైపోయినా మన జీవితాలను కూడా అందమైన పాత్రగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్న, మన బలహీనతలు ఏమైనా  దేవుడు వాటిని తొలగించి  మనలను   మరల సుందరంగా అందంగా మార్చుతాడు, మార్చగలడు.  ఓ! యిస్రాయేలు ప్రజలారా మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అంటున్నారు.  కాబట్టి మనము అర్ధం చేసుకోవలసినది మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, మన  జివితాలు దేవుని చేతిలో ఉంచితే మన జీవితాలను, కుటుంబాలను సంఘాలను దేవుడు ఎంతో అందంగా మార్చివేస్తారు. 

మన జీవితాలు ఎవరి చేతులో ఉన్నాయి? మనము ఏ విధంగా ఉన్నాము? ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో మనము మన జీవితాలను వేరే వారి చేతులలో పెడుతున్నాము. మన జీవితాలను నాశనము చేసుకుంటున్నాము. పదే పదే పాపములో పడిపోయి, పాపపు పనులు చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? అంటున్నాడు. మరి మన సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు ? ఆత్మ పరిశీలన చేసుకుందాం.  మనము దేవునికి మనలను మార్చడానికి అవకాశం ఇస్తున్నామా? పునీత అగస్టిను వారు నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించాడు అని అంటున్నాడు. మరి మనము దేవుని చిత్తమునకు అనుమతిస్తున్నామా? 

సువిశేష పఠనంలో పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్నివిధములైన చేపలను పట్టు వలను పోలియున్నది అని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. అపుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే  దూతలు అంత్యకాలంలో మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవించేవారు, బుట్ట అంటే పరలోకరాజ్యము. పనికిరాని చేపలు అంటే దుష్టులు చెడు పనులు చేయువారు. వీరు నరకంలో పారవేయబడి శిక్ష అనుభవిస్తారు. కాబట్టి పరలోకంలో చేరాలి అంటే మనము మన పాప క్రియలను విడిచి పశ్చాతాపంతో ప్రభువును ఆశ్రయించాలి, ప్రార్ధించాలి. అపుడు దేవుని రాజ్యంలో చేర్చబడుతాం. 

ప్రార్ధన: ప్రభువైన దేవా మేము మమ్ము తగ్గించుకొని ప్రతినిత్యం మా జీవితం విధానాలను మార్చుకుంటూ మీ  సందేశాన్ని, ప్రణాలికను అర్ధంచేసుకుంటూ మా జీవితాలను అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మంచి వారిగా ఉంటూ మంచి పనులను చేస్తూ పరలోక రాజ్యం పొందేబాగ్యం మాకు దయ చేయండి. ఆమెన్

ఫా. సురేష్ కొలకలూరి  

27, జులై 2024, శనివారం

17వ సామాన్య ఆదివారం


2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్నవి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి యెడల దేవుడు తన యొక్క కనికర హృదయమును ప్రదర్శిస్తూ వారి యొక్క శారీరిక ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. 
ఈనాటి మొదటి పఠణములో ఎలీషా ప్రవక్త దేవుని అనుగ్రహము ద్వారా చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమును చదువుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దంలో దేవుని సందేశమును ప్రకటించారు.  ఆయన ప్రవచించే సందర్భంలో కరువు సంభవించినది. ఒకరోజు బాల్షాలిషా నుండి ఒక భక్తుడు ఏలీషా ప్రవక్తకు కానుకగా 20 రొట్టెలను, ధాన్యాన్ని సమర్పించారు. ఎలీషా ప్రవక్త ఈ యొక్క రొట్టెలను తన చెంతకు వచ్చిన ప్రవక్తలకు పంచి పెట్టమని చెప్పారు కానీ వారి సంఖ్య అధికముగా ఉండుటవలన ఇవి సరిపడమని భావించి సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటివి అని ప్రశ్నించారు. వాస్తవానికి ఎలీషా ప్రవక్త దేవునియందు నమ్మకం ఉంచి అవి సరిపోతాయి అని శిష్యుడికి తెలుపుచున్నారు. ఎలీషా ప్రవక్త తనకు ఇవ్వబడినది, ఇతరులకు పంచి ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన యొక్క మంచితనము మరియు విశ్వాసమును బట్టి అద్భుతం చేశారు. 
ఈ యొక్క మొదటి పఠణము ద్వారా మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఎలీషా ప్రవక్త యొక్క ఉదారత. ఏమియు ఆశించకుండా ఇతరులకు మేలు చేయాలని కోరుకున్నాడు.
2. ఎలీషా ప్రవక్త యొక్క విశ్వాసం. శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు 20 రొట్టెలను 100 మందికి సమకూరుస్తారు అని ఎలీషా విశ్వసించారు. ఎడారిలో మన్నాను ఇచ్చిన దేవుడు అవి మిగులు లాగిన చేశారు అలాగే ఈ రొట్టెలు కూడా ఇంకా మిగులుతాయి అని చెప్పారు.
3. ఆకలిని సంతృప్తి పరచాలి అనే కోరిక ఎలీషా ప్రవక్తకు ఉన్నది. ఇతరుల యొక్క ఆకలి గుర్తించి వారికి ఆహారము ఇచ్చారు.
4. సేవకుని యొక్క విధేయత. యజమానుడి యొక్క మాటను నమ్మి ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపారు.
ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరినీ కూడా దేవుడు, మన కొరకు ఏర్పరిచినటువంటి అంతస్తుకు తగిన విధంగా జీవించమని తెలుపుచున్నారు దానిలో భాగంగా మనము సాధువులు గను, సాత్వికులుగను, సహనశీలురులుగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రేమను పంచుకోవాలి అని పౌలు గారు కోరారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు 5000 మందికి(స్త్రీలను, చిన్న బిడ్డలను లెక్కించకుండా) ఆహారమును ఒసగిన విధానము చదువుకుంటున్నాము. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు సంతృప్తిగా పోషింపబడతారు అని కూడా ప్రభువు తెలుపుతున్నారు అయితే ఈ యొక్క సువిశేష భాగములో ఏసుప్రభు అద్భుతం చేయుటకు కారణము ఒక బాలుడు తన వద్ద ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఇతరుల కొరకై సమర్పించిన విధానం.  ఈ యొక్క సువిశేష భాగములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు; 
1. ఏసుప్రభు యొక్క కనికర హృదయం. ఆయన తన ప్రజల మీద జాలి కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలిని సంతృప్తి పరచాలని భావించారు.
2. బాలుని యొక్క త్యాగ గుణం. తన దగ్గర ఉన్నది కొంచెమైనప్పటికీ కూడా, అదియు తన కొరకు తెచ్చుకున్నటువంటి ఆహారమైనప్పటికీ ఆయన  త్యాగం చేసి ఇతరుల కొరకు శిష్యులకిస్తున్నారు. 
3. బాలుడు యొక్క ఉదార స్వభావం. ఈ యొక్క బాలుడు సంతోషముగా ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై తన వంతు, తన దగ్గర ఉన్నటువంటి భాగమును సమర్పిస్తున్నారు. 
ఒకరోజు కలకత్తాపురి మదర్ తెరెసా గారు తన జీవిత సంఘటన తెలుపుచున్నారు అది ఏమనగా; మదర్ థెరీసా గారు ఒక పేద కుటుంబమును సందర్శించి వారికి ఒక బియ్యం బస్తాను ఇచ్చారు. వారు దాదాపుగా ఒక వారం రోజుల పాటు భోజనం చేయడం లేదని గ్రహించి వారి యొక్క దీనస్థితిని గుర్తించి మదర్ తెరెసా వారికి సహాయం చేశారు. ఆ సహాయము పొందినటువంటి కుటుంబము ఆ బస్తా బియ్యంలో సగం బియ్యమును తీసుకొని వేరే వారికి ఇంకొక సగం బస్తా బియ్యమును ఇచ్చారు. ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావు అని  అడిగినప్పుడు ఆ యొక్క తల్లి చెప్పిన మాట, మేము కేవలం వారం రోజుల నుండి పస్తులు ఉంటున్నాం కానీ మా కన్నా ఎక్కువగా మా యొక్క పొరుగువారు పస్తులు ఉంటున్నారు అదేవిధంగా వారి కుటుంబంలో కూడా పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్లకి కూడా ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మాకు ఉన్న సగం ఇచ్చాను అని తెలుపుచున్నది. ఈ యొక్క సంఘటన ద్వారా మదర్ తెరెసా గారు ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేస్తే దానిలో నిజమైన సంతోషం ఉందని  గ్రహించింది. ఈ యొక్క బాలుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు రెండు చేపలను ఇతరుల యొక్క సంతోషం కొరకై ఉదారంగా ఇచ్చారు. 
4. ఐదు రొట్టెలు రెండు చేపలు తిరు సభలో ఉన్న ఏడు దివ్య సంస్కారాలకి ప్రతిరూపం. ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆనాటి ప్రజల యొక్క ఆకలిని సంతృప్తి పరచిన విధముగా ఈ యొక్క ఏడు దివ్య సంస్కారాలు ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరుస్తుంది. వాటిని స్వీకరించటానికి మనము సిద్ధముగా ఉండాలి.
ఈ యొక్క పరిశుద్ధ గ్రంధం పట్టణముల ద్వారా మనం కూడా మన జీవితంలో ఇతరులను యొక్క ఆకలి బాధను చూసి వారికి ఆహారమును ఇవ్వాలి. ఎంత ఇచ్చాము అన్నది ప్రభువు చూడరు కానీ వారికి మంచి చేశామా అన్నది ప్రభువు చూస్తారు కాబట్టి మన అందరిలో కూడా త్యాగం చేసేటటువంటి గుణం, కనికరం కలిగిన హృదయం, ఉదారంగా ఇచ్చే మనసు ఎప్పుడూ ఉండాలి అప్పుడే మనం కూడా ఇంకా అధికముగా దీవించబడతాం. మనం చేసే మనిషి వలన ఇతరులు సంతోషము ను పొందుతారు కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వరములను ఇతరులతో పంచుకుంటూ సోదర ప్రేమ కలిగి జీవించటానికి ప్రయత్నించుదాం. 
Fr. Bala Yesu OCD

20, జులై 2024, శనివారం

16వ సామాన్య ఆదివారం


యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34

ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపాడుతుంటారు అని అంశమును తెలుపుచున్నవి. దేవునికి ప్రజలకు ఉన్నటువంటి బంధము ఏ విధంగా ఉన్నదంటే కాపరికి మందకు ఉన్నటువంటి బంధం ఇవి రెండూ కూడా ఎప్పుడు కలసి ఉంటాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త యొక్క మాటలను చదువుకుంటున్నాము. యిర్మియా ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా రాజధాని అయినటువంటి యెరుషలేములో పరిచర్యను చేశారు. ఆయన అనేక మంది రాజులను, ప్రజలను, నాయకులను దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించమని తెలిపారు. దేవుని యొక్క దృష్టిలో ఏది  ఉత్తమం దానిని ప్రకటించారు. యిర్మియ సత్యమును ప్రకటించుటవలన అనేక బాధలను అనుభవించవలసి వచ్చింది. యిర్మియా ప్రవక్త సెద్కియా కాలంలో ప్రవచించారు. ఆయన ఒక బలహీనమైన రాజు, నిలకడత్వం లేని వ్యక్తి. ప్రవక్త యొక్క సందేశాన్ని ఆలకిస్తాడు కానీ దానిని ఆచరణలో ఉంచడు. అప్పుడు యూదా రాజ్యం బాబిలోనియా చక్రవర్తికి లోబడుతుంది. యిర్మియా ప్రవక్త రాజును బాబిలోని రాజుకు లోబడి జీవించమని తెలిపినప్పుడు దానిని ఆచరించలేదు దానికి బదులుగా రాజభవనంలో ఉన్న కొంతమంది సలహాదారులు ఐగుప్తు సహాయం రాజు సహాయం కోరమని తెలియజేశారు కానీ యుద్ధం చేసిన తర్వాత యూదా ప్రజలు ఓడిపోయారు దానికి గాను బాబిలోనికి బానిసత్వానికి వెళ్లారు. 
నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి ప్రభువే స్వయముగా తన గొర్రెలను ప్రోగు చేసి వారి కొరకు కాపరులను నియమిస్తాను అని తెలుపుచున్నారు. దేవుడే స్వయముగా ఒక కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చుతారు అనేటటువంటి అంశమును కూడా తెలుపుచున్నారు (కీర్తన 23). ఆయన యొక్క శ్రద్ధ వలన తన మంద పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తన మందను ఎన్నడూ విడిచి పెట్టినటువంటి కాపరులను కూడా నియమిస్తానని తెలుపుచున్నారు. యావే ప్రభువు తనకు ఉన్నటువంటి ప్రేమ వలన ప్రజల కొరకు మంచి కాపరులను నియమిస్తానని తెలుపుచున్నాను.
దేవుడు ఎవరికి అయితే తమమందనం చూసుకొనమని బాధ్యతను అప్పగించి ఉన్నారో వారు సరిగా వ్యవహరించకపోతే దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తుంటారు అని పలికారు. దేవుడు నమ్మి బాధ్యతను అప్పగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా నెరవేర్చాలి. తండ్రికి కుటుంబ బాధ్యతను అప్పగించారు, గురువుకు విచారణ బాధ్యతను అప్పగించారు, ఉపాధ్యాయునికి పిల్లల బాధ్యతను అప్పగించారు, వైద్యులకు రోగుల బాధ్యతను అప్పగించారు, రాజకీయ నాయకులకు దేశ ప్రజల బాధ్యతను అప్పగించారు ఈ విధముగా చాలా విధములైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి వానిని మనము సక్రమముగా ప్రజల యొక్క, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై వినియోగించాలి. 
అందరి కొరకై దేవుడు దావీదు వంశము నుండి మంచి కాపరి అయినటువంటి ఏసుప్రభువును, మనలను పరిపాలించు నిమిత్తము పంపిస్తారు అని కూడా యిర్మియా ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు ఉత్తమ కాపరిగా ఉంటూ యూదులను అన్యులను ఐక్యము చేశారు అని తెలిపారు. ఏసుప్రభు యూదులను మరియు అన్యులను సఖ్యపరచి వారిని ఒకటిగా చేశారు. ఏసుప్రభు నందు విశ్వాసము ఉంచినటువంటి వారందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే ప్రజగా జీవిస్తారు అని తెలిపారు  (గలతి 3:28-29). క్రైస్తవులుగా మారిన యూదులు ఏసుప్రభువును మెస్సయ్యగా గుర్తించి అంగీకరించారు, అదే విధముగా అప్పటివరకు అన్య దైవములను పూజించిన అన్యులు కూడా యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించి విశ్వసించి ఆయనను వెంబడించారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యొక్క శిష్యులు పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటనను చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక రకములైన అద్భుతములు చేసి దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరచి తిరిగి వచ్చారు వారి యొక్క స్థితిని చూసినటువంటి ప్రభువు వారికి కొద్దిపాటి విశ్రాంతి కావాలి అని భావించారు. అందుకే ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు కానీ అదే సందర్భంలో ప్రజలు అనేకమంది ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. 
ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఏసుప్రభువుకు తన శిష్యులు మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ.  ( వారి యొక్క శారీరక బలహీనతను అర్థం చేసుకున్నారు)
2. ప్రతి ఒక్కరి జీవితంలో కొద్ది సమయం విశ్రాంతి (A time of introspection) తీసుకోవాలి ఎందుకంటే ఆ విశ్రాంతి సమయంలో మనం ఎలాగ జీవించాము అని ఆత్మ పరిశీలన చేసుకొనుట కొరకై.
3. ప్రభువు తన యొక్క ప్రజల యొక్క అవసరతను గుర్తించి వారికి బోధించారు. 
4. దేవుని యొక్క వాక్కు కొరకై ప్రజలకు ఉన్నటువంటి గొప్ప తపన. 
5. దేవుని కొరకై తపించేవారు ఎప్పుడు దేవుని విషయంలో ముందే ఉంటారు. ప్రజలు ఏసుప్రభువు చూడటానికి వారి కంటే ముందుగా కాలినడక మీదనే వచ్చారు.
6. ఏసుప్రభు యొక్క సహనము మనము అర్థం చేసుకోవాలి అలసిపోయినప్పటికీ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇవ్వవలసిన సమయం దేవుడు వారికి ఇస్తున్నారు. 
7. ప్రభువు కాపరి వలె తన మందమీద కనికరమును చూపించారు మనం కూడా అదే విధంగా జీవించాలి.
ఈ యొక్క పరిశుద్ధ పఠణముల ద్వారా దేవుడు మనందరిని కూడా కాపరులుగా ఉంచుతూ మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చమని తెలుపుచున్నారు. 
యిర్మియా తన బాధ్యతను నెరవేర్చిన విధంగా, పౌలు తన బాధ్యతను నెరవేర్చిన విధంగా మరియు శిష్యులు తమకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసిన విధంగా మనకి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కాపరి వలె మంచి చేస్తూ మంద కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

లూకా 5: 33-39

  లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము త...