21, జనవరి 2026, బుధవారం

లూకా 5: 33-39

 

లూకా 5: 33-39

"యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?" అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు "పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చెయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయుకాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: "ప్రాత గుద్దకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన యెడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాత గుద్దకు అతుకుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన యెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక, క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును  తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును". 

ధ్యానము:  దేవుని అనుగ్రహం కోసం  పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేసేవారు. కేవలం దేవుని అనుగ్రహం పొందడం కోసమే కాక పశ్చాత్తాపమును వ్యక్తము చేయుటకు కూడా ఉపవాసం చేసేవారు. దేవుని పండుగలను కొనియాడేముందుగా ఆ పండుగ కోసం ఆయత్తపడుట లేక సిద్ద పడుట కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, దానికి సిద్దపడుతూ ఉపవాసం చేసేవారు. ఈ విధంగా పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేయడం మనము చూస్తాము. యోహాను శిష్యులు చేసే ఉపవాసం మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, అందుకు సిద్ద పడుటకు చేసే ఉపవాసము. ఎందుకంటే యోహాను ఈ మెస్సియ్యా రాకడను గురించి అందరు సమాయత్తపడాలని బోధించాడు.  అంతేకాక యోహాను  కొమరను సంఘం గురించి తెలిసినవాడని వీరు   మెస్సియ్యా రాకడకు సిద్దపడే సంఘం కాబట్టి వారితో కలసి జీవించాడు అనే నమ్మకం కూడ కొంత మందిలో ఉండేది.  వీరు ప్రార్ధన,  ఉపవాసములతో జీవించారు.  యోహాను కూడా అతి స్వల్పమైన ఆహారముతోనే  జీవించాడు.  యోహాను జీవితం  ప్రభువు రాకడకు సిద్ధపాటు జీవితంగా సాగింది. 

యేసు ప్రభువు దగ్గరకు కొందరు వచ్చి యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం, ప్రార్థనలు  చేస్తారు కాని మీ శిష్యులు తిని త్రాగుచున్నారేలా? అని ప్రభువును వారు ప్రశ్నించారు. అయితే ప్రభువు ఎందుకు ఆయన శిష్యులు ఉపవాసం చేయడం లేదో వారికి వివరిస్తున్నారు.  యేసు ప్రభువు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం చేయుదురా అని అడుగుతున్నారు. ప్రభువు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే  యేసు ప్రభువే  మెస్సియా.  యోహాను లేక అతని శిష్యులు ఉపవాసం చేసేది ఈ మెస్సియా కోసమే. అందుకే యోహాను శిష్యులలో కొంతమంది యేసు ప్రభువే మెస్సియా అనే  సత్యం తెలుసుకున్న  తరువాత యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తి  మెస్సియా రాకడకొరకు, లేక రక్షకుని ఆహ్వానించడానికి ఉపవాసం చేసినట్లయితే ఇప్పుడు ఆ పని చేయనవసరం లేదు. ఆ రక్షకుడు వారి దగ్గరనే ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. శిష్యులు దేవుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయవలసి వస్తే అది అవసరం లేదు, దేవుడే వారితో ఉన్నారు. కనుక ప్రభువు రూపంలో  సమస్తము వారి దగ్గరనే ఉన్నవి.   శిష్యులు పాప క్షమాపణ కోసమో లేక పశ్చాతాపము వ్యక్తపరచడానికో ఉపవాసము చేయవలసి వస్తే వారిని ప్రభువు తన సాన్నిధ్యంతో పవిత్రులను చేస్తున్నారు అందుకు కూడా వారు ఉపవాసం చేయనవసరం లేదు.   ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మరియు దేవునితో సత్సంబంధము నెలకొల్పుకొనుట. ప్రభువే వారితో ఉంటున్నారు కనుక దేవునితో వారికి మంచి సంబంధము ఉంది. ప్రతి రోజు, ప్రతి నిముషం వారు ప్రభువు తోనే ఉంటున్నారు. ప్రభువుతో వారు మాట్లాడుతూనే ఉన్నారు.   

పెండ్లి కుమారుడు వారి నుండి ఎడబాయు కాలము వచ్చును అప్పుడు వారు  ఉపవాసము చేయుదురు అని ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నంత కాలము వారు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. వారు ఉపవాసము చేయనవసరం లేదు. కాని వారి వద్ద నుండి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వారు తప్పకుండా ఉపవాసం చేయవలసి వస్తుంది. పాత నిబంధనలో దైవ మందసము యిస్రాయేలు నుండి తీసివేయబడింది. అపుడు ఆ ప్రజలు బాధలలో నిండిపోయారు. అందుకే ఏలి కోడలు , ఏలి దేవుని మహిమ యిస్రాయేలును విడిచిపోయినది అని చెబుతున్నారు.   ప్రభువు మనతో లేనప్పుడు మనము ఉపవాసం చేయవలసిన సమయం. అది శిష్యుల జీవితంలో కూడా వస్తుంది.  ఆయన వారి వద్ద నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రభువు మన వద్ద నుండి వెళ్ళిపోతారు? పవిత్ర గ్రంథంలో దేవుని సాన్నిధ్యం ఎప్పుడు యిస్రాయేలు ప్రజలకు దూరం అవుతుంది అంటే యిస్రాయేలు ప్రజలు వారికి ఇష్టమైన విధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో అపవిత్రంగా ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉండి అక్కడ సేవ చేసేవారిని బాధించినప్పుడు, దైవ సాన్నిధ్యాన్ని అపవిత్ర పరచినప్పుడు, యిర్మీయా చెబుతున్నట్లు, గర్వంతో ఉంటూ,  మంచి జీవితం జీవించకుండా  నాకు ఏమి కాదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకునే సమయాల్లో  దేవుడు దూరమవుతారు. అటువంటి  పరిస్థితిలో  ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయవలసి ఉంటుంది. ఆ ఉపవాసం మరల ప్రభువుతో కలసి ఉండుటకు. 

సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు శిష్యులతో ఉన్నంత కాలం శిష్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు మీతో కలసి ఉండటం వలన, మిమ్ములను పొందటం వలన, మీ సహచర్యంలో జీవించడం వలన వారి జీవితంలో ఒక మధురానుభూతిని పొందుతున్నారు. అనేక మంది దీర్ఘదర్శులు ఈ ప్రభువు సాన్నిధ్యం అనుభవించాలని కోరుకున్నారు. కాని వారందరికీ దొరకని ఈ గొప్ప అవకాశం మీ శిష్యులకు అనుగ్రహించారు.  ఆ ధన్యతను  మీ శిష్యులు పూర్తిగా తెలుసుకున్న, తెలుసుకోలేక పోయిన అది స్వర్గీయ అనుభూతి.  అందుకే వారిలో కొందరైనా మీ సాన్నిధ్యం విలువ తెలుసుకొనవలెననేమో   మీరు ముగ్గురితో రూపాంతరీకరణ చెందుతున్నారు. ప్రభువా! మీ సహాచర్యము మనిషిని ఎంత ఉన్నతునిగా తీర్చిదిద్దుతుందో సాధారణ జాలరులు, సుంకరులుగా ఉన్న వారు, ఎంతటి ఉన్నత కార్యాలు చేయగలిగారో  తెలుసుకుకోవడం వలన తెలుస్తుంది.  ప్రభువా! మీ సాన్నిధ్యం కోల్పోవడం అంటే మేము పాపంలో కూరుకుపోవడమే. మేము ఎల్లప్పుడు పవిత్రంగా ఉంటూ, చెడు క్రియల జోలికి పోకుండా, గర్వం దరిచేరనివ్వకుండ, మీ మహిమ మమ్ములను ఎప్పటికి విడిపోకుండా మమ్ము  దీవించండి. అంతేకాక మా చెడు జీవితం వలన మిమ్ము దూరం చేసుకొన్న సమయాలలో మీతో కలసి ఉండాలనే కోరికతో మేము చేసే ఉపవాసమును, మీతో సత్సంబంధమును ఏర్పరుచుకొనుటకు మేము చేసే ప్రార్ధనను ఆలకించి మమ్ము అనుగ్రహించండి. ఆమెన్  

Fr. Amruth 

20, జనవరి 2026, మంగళవారం

ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు?

 

ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు?

లూకా 18:9-14

పిమ్మట యేసు తాము నీతిమంతుల మనియు, తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను: “ప్రార్ధనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు. మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ‘ఓ దేవా!నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండుమారులు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను’ అని ప్రార్థించెను. కాని సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ‘ఓ దేవా!ఈ పాపాత్ముని కనికరింపుము’ అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింపబడి , ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును.

 ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషంలో ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనే ప్రశ్నకు జవాబును చూస్తున్నాము. మనము మనకై   దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మన యొక్క శక్తి సామర్ధ్యలు అందుకు సరిపోవు. దేవుని దయ, కృప చాలా అవసరము, వాటి ద్వార మాత్రమే ఇది సాధ్య పడుతుంది. అప్పుడు ఎవరికి, ఎటువంటి వారికి దేవుడు ఈ అనుగ్రహం దయ చేస్తారు? ఈ అనుగ్రహం పొందేవారు ఎలా ఉండాలి? అనే విషయాలను  మనం ఈనాటి సువిశేషంలో చూస్తున్నాము. ఈ అనుగ్రహాన్ని ఇవ్వడానికి మననుండి ఎటువంటి ప్రవర్తనను ఆయన ఆశీస్తున్నారో ఈ సువిశేషం ద్వారా తెలియజేస్తున్నారు.  

ఎటువంటి ప్రవర్తనను దేవుడు మన నుండి కోరుకోరు అనే ప్రశ్నకు పరిసయ్యుని యొక్క ప్రార్థనలో  మనం  సమాధానం చూస్తున్నాము. మనలను మనం పొగుడుకున్నప్పుడు దేవుడు దానిని అంగీకరించడు. ఇద్దరు దేవాలయానికి ప్రార్ధనకు  వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. “పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ‘ఓ దేవా!నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండుమారులు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను’ అని ప్రార్థించెను.”   పరిసయ్యుని ప్రార్థన మనకు అతను  గర్విష్టి అని మరియు అహంకారి అని మరియు ఇతరుల తప్పులేన్నే వాడని తెలియజేస్తుంది. అంతేకాదు తాను చేసే ప్రతి పనిని పొగుడుకుంటున్నాడు. అతని ప్రార్థన దేవుని ఆనందింప చేయలేదు. 

దేవుడు పరిసయ్యుని నుండి ఏమి కోరుకున్నాడు?

ఇతను చెప్పేనటువంటివి అన్ని నిజమే కాని వీటి కంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుడు ఆయన నుండి ఆశించినది ఏమిటి? అంటే ఇతను దేవుని ప్రతినిధి వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఏ విధంగా దేవునికి ప్రతినిధిగా ఉండాలి అంటే దేవుని ప్రేమ కరుణ , లోభి తనంలో ఉన్న వారికి , వ్యభిచారులకు , అన్యాయము చేయువారికి కూడా దేవుని కృప చూపించడంలో ఇతను దేవుని ప్రతినిధి వలె ఉండాలి. యూదుల ఆచారాలకు సంభందించి మిష్నఅనే ఒక నియమావళి ఉండేది. దానిలో ఒక వ్యక్తి మత పరమైన నాయకుడు కావాలి అంటే అతను వారానికి రెండు సార్లు ఉపవాసం చేయాలి, తనకు వచ్చిన ఆదాయంలో 10 శాతం దేవాలయానికి ఇవ్వాలి. తాను మత నాయకుడు కావడానికి ఇవ్వన్ని చేస్తున్న, మత నాయకుడు అయ్యేది దేని కోసం, దేవుని గురించి తెలియ జేయడం కోసం.  మరి ఎందుకు ఆయన ప్రతినిధిలా దేవుని కరుణను, కృపను ఆ సుంకరికి చూపించడంలో విఫలం అవుతున్నారు, దానికి కారణం ఏమిటి అంటే  దేవున్ని సరిగా అర్ధం చేసుకోక, అధికారం అంటే కేవలం ఇతరుల మీద పెత్తనం అనుకోవడం వలన, పాపంలో ఉన్న వారి పరిస్థితులను అర్ధం చేసుకోలేక పోవడం వలన వారిని హేళన చేస్తామే కాని వారిని దేవుని వద్దకు తీసుకురావడానికి మనము ఏమి చేయడం లేదు. ఇక్కడ పరిసయ్యుడు అదే చేస్తున్నాడు.    

ఈ ఉపమానము  యేసు ప్రభువు తమను తాము నమ్ముకునేవారు, తాము నీతిమంతులము అనుకునేవారు, మిగిలిన వారిని పాపులుగా పరిగణించేవారి గురించి  చెప్పడం జరిగింది. మేము నీతిమంతులము లేక మాలో ఏ తప్పు లేదు అని అనుకునే ప్రతి వ్యక్తికి, ఇతరులు చేసే ప్రతి పనిని తప్పు పడుతూ, మేము మాత్రమే మంచి వాళ్ళము అనుకునే వారికి అందరికి చెప్పబడిన ఉపమానం.

ఈ ఉపమానం మనకు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది. అవి ఏమిటి అంటే , దేవుని కృప,  దయ మీద కాకుండా మన స్వశక్తి మీద నమ్మకం ఉంచి మనం మాటలాడుతున్నామా? మిగిలిన వారిని విమర్శించకుండా మనం జీవిస్తున్నామా? లేక ఇతరులు చేసిన పనులను మనం విమర్శిస్తూ వారు  ఇటువంటి వారు, వీరు ఇటువంటి వారు అని అనుకుంటున్నమా? ఒక సారి లోతు భార్యకు ఏమి జరుగుతుందో చూడండి. ఆమె ఇతరులకు ఏమి అవుతుందో చూడాలి అని అనుకున్నది, ఒక ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే మనం మన పనులను , మన కర్తవ్యాన్ని మరచిపోతాం, మరియు మనల్ని మనం కోల్పోతాము.  దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో నీ గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను నిందిస్తున్నమా? పరిసయ్యుడు యూదుయా ప్రజలలో అత్యంత భక్తి  విభాగానికి చెందిన వాడు, సుంకరి అత్యంతగా తిరస్కరణకు, ప్రజల అయిష్టతకు కారణమయిన పని చేస్తున్నటువంటి  వాడు.  

అసలు ఎవరు ఈ పరిసయ్యులు అని ఒక సారి మనం ఆలోచించినట్లయితే, వీరు ఆనాటి సమాజంలో విశ్వాస జీవితానికి మరియు భక్తియుతమైన జీవితానికి  కారకులు, దేవుని చట్టమును పూర్తిగా అవగాహన చేసుకొని పాటిస్తున్నటువంటి వారు. యేసు ప్రభువు కాలంలో పరిసయ్యులు నిజముగా గొప్పవారు. వారి భక్తి కావచ్చు లేక వారు చేసే పనులు కావచ్చు ఇవన్నీ చాల గొప్పగా ఉండేవి. వారిని అందరు గొప్పవారుగా గౌరవిస్తూ వుండేవారు. వారి మత పరమైన ఆచార వ్యవహారాలు అందరికి ఆసక్తి దాయకంగా మరియు ఇతరులకు  ఇంత కష్టతరమైన జీవితాలు సాధ్యం కాదేమో అనేలా వారు జీవించేవారు.  జీవిస్తే వీరిలా  జీవించాలి అనే కోరికను పుట్టించే విధంగా ఉండేవి. వారి నైతిక జీవితం కూడా అంతే గొప్పగా ఉండేది. వారు రోజులో గంటల తరబడి ప్రార్థన చేసేవారు. వారానికి రెండు సార్లు ఉపవాసం చేసేవారు. పవిత్రత మరియు ధర్మ శాస్త్రాలతో  వారి జీవితం అంత ముడి పడి ఉండేది. మిగిలిన ప్రజలు వీరిలా జీవించడం మనకు సాధ్యపడదు అనే ఆలోచనలో ఉండేవారు. ఒక యుదుడు  ఎవరైన పరలోకంలో ఉన్నాడు అంటే అది పరిసయ్యుడై ఉండాలి అనుకునేవాడు. 

సుంకరులను ఎందుకు నీచులుగా చూసేవారు 

సుంకరులు రోమియులకు పని చేస్తూ, యూదులను పన్నులు అడుగుతూ , యూద సమాజ ద్రోహులుగా పరిగణించబడినవారు. వీరు వారి సొంత ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసి రోము సామ్రాజ్యానికి పంపేవారు. సంవత్సరానికి ఇంత పన్ను అంటూ వారికి రోమా సామ్రాజ్యం నుంచి ఆదేశాలు ఉండేవి అవి చెల్లించిన తరువాత మిగిలినవి వీరు వారు ధనవంతులు కావడంకోసం వసూలు చేసేవారు.  అందుకే వీరిని ప్రజలు  ద్రోహులుగా చూసేవారు. ప్రజలు వారిని అనేక రకాలుగా అసహ్యంగా చూసేవారు. వారు వారి సొంత దేశాన్ని మోసం చేశారు అని భావించేవారు . వారు ఎక్కువ పన్నులు పేదల దగ్గర పన్నులు వసూల్లు చేసి   ధనవంతులుగా ఎదిగారని వారిని అసహ్యించుకొనేవారు. యూదయ చట్టం మిష్ణ ప్రకారం వారు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి అర్హులు కారు. ఎందుకంటే వారు అబద్ధికులని అందరు పరిగణించేవారు. వీరిని ఒకరకంగా అంటారనివారిగా చూసేవారు. వీరిని దొంగలు హంతకులను చుసినట్లు చూసేవారు. వారిని కుటుంబానికి ఒక అమంగళంగా చూసేవారు. ఎవరైన దేవుని రాజ్యం బయట ఉన్నారు అంటే అది మొదటగా ఒక సుంకరి అని అనుకునేవారు.అటువంటి ఒక సుంకరి దేవుని దృష్టిలో నీతిమంతునిగా పరిగణించబడటం ఏమిటి? ఎందుకు దేవుడు అతనిని నీతి మంతినిగా చూస్తున్నాడు? వారు చేసిన ప్రార్ధన వారి మనస్తత్వాన్ని, ఎందుకు దేవుడు పరిసయ్యున్ని అంగీకరించ లేదో చెబుతుంది. 

ప్రార్ధనలు

పరిసయ్యుడు నిలుచొని ఈ విధంగా ప్రార్థించాడు. దేవా నేను ఇతని లాంటి వాడిని కానందుకు కృతజ్ఞతలుఅవినీతి పరుడును కానువ్యభిచారిణి కాను. నేను వారానికి రెండు సార్లు ఉపవాసం చేసెదను నాకు వచ్చిన ప్రతి దానిలో నేను మీకు పదవ వంతు చెల్లిస్తున్నాను. కాని సుంకరి దూరముగా నిలువబడి తన కళ్లను కూడా ఎత్తుటకు సాహసించక తన రొమ్ము బాదుకొనుచు దేవా ఈ పాపిని కరుణించుము అని ప్రార్థిస్తున్నారు. పరిసయ్యుడు ప్రార్ధనను చాలా భక్తితో ప్రారంభించాడు కాని వెంటనే అది తనను తాను పొగుడుకునే వేదిక అయ్యింది. తనను గురించి  తాను రెండు వాక్యాలలోనే  5 సార్లు చెప్పుకున్నాడు. కాని ఇవ్వి ఏమి ఆయనను గొప్ప వాడిని చెయ్యవు. తనను తాను మంచి వాడిని అని అతను అనుకుంటున్నాడు. ఒకడు తనను తాను పొగుడుకున్నట్లయితే అది అతనికి వున్న గర్వం మరియు అహంకారంతోటి మాత్రమే అటువంటి మాటలు వస్తూ  ఉంటాయి. తాను చేసే ప్రతి పనిని ఆయన సమర్ధించుకుంటున్నాడు. తనకు ఉన్న క్రమ శిక్షణను కూడా తాను చేసిన గొప్ప పని అనుకుంటున్నాడు. తన కుటుంబ జీవితం కూడా తన గొప్పతనం అన్నట్లుగా ఉంది. అతను సుంకరిని కించ పరుస్తూ నేను ఇతని లాంటి వాడిని కాదు అని చెబుతూ తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. 

ఇతను మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుతూ మొదలు పెట్టాడు. కాని తనను పొగుడుకొనుటతోటి ప్రార్థన ముగిస్తున్నాడు. దేవునికి తాను కృతజ్ఞత తెలియచేసేది పరిసయ్యుడుకి  ఉన్న సుగుణాల గురించి కాదు , సుంకరిలా లేనందుకు.  పరిసయ్యుడు తనను ఇతరులతో పోల్చుకొని గొప్పవాడిని అనుకుంటున్నాడు. అతను దేవునితో పోల్చుకోవడం లేదు. లేక దేవుని వాక్కుతోటి పోల్చుకోవడం లేదు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే అతను తనను తాను తగ్గించుకోవాలి అని అనేక సార్లు యేసు ప్రభువు చెప్పారు, దేవుని వాక్యము గొప్పతనం గురించి ఏమి చెబుతుందో తెలుసుకొని ఎవరితో పోల్చుకోవాలో తెలుసుకున్నట్లయితే అతడు ఎంత గొప్పవాడో తెలిసేది. అప్పుడు మాత్రమే నిజమైన గొప్పతనం తెలుస్తుంది. ఇతను చివరికి తనతో పాటు ఉన్నటువంటి ఉన్నత జీవిత విధానానికి సంబంధిచిన వారితో కూడా పోల్చుకోవటం లేదు. అతను సమాజంలో అధమునిగా పరిగణించిబడే ఒక వ్యక్తితో పోల్చుకుంటున్నాడు. మరియొక పరిసయ్యునీతో కూడా పోల్చుకోవడం లేదు. అంతే కాకుండా ఆయన ఏమేమి చేయలేదో, ఎటువంటి పాపం చేయడం లేదో దానికి గురించి చెపుతున్నాడు. కాని దేవుని ప్రేమను పంచడం కోసం ఏమి చేసాడో చెప్పడం లేదు. ఇతను ఎంత గర్వంతో ఉన్నాడు అంటే ఇతరులు  చేసే ప్రతి పనిని  గురించి ఆలోచిస్తూ వారిని   అల్పులు అని కేవలం అతను మాత్రమే గొప్పవాడు అని  అనుకుంటున్నారు.

 ఎప్పుడైతే ఒక వ్యక్తి తనే గొప్పవాడను అని అనుకుంటాడో, అతను ఇతరుల మంచిని చూడలేడు అంతేకాదు తాను తప్ప ఇతరులు మంచి వారు అంటే ఒప్పుకోలేడు. ఇటువంటి వారు  తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూడలేరు. తనను ఇతరులతో పోల్చుకున్న తరువాత తనని తాను పొగుడుకుంటూ తనను తాను ఆరాధించు కొంటున్నారు. ఆయన వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తాను అని అంటున్నాడు. కాని లెవీయ కాండం  16:29 ఒకసారి మాత్రమే  ఉపవాసం చేయమని అడుగుతుంది. ధర్మ శాస్త్రం అతని పంటలలో , ఉత్పత్తిలో మాత్రమే 10 శాతం అడుగుతుంది. కాని ఇతను ఆదాయంలో 10 శాతం ఇస్తున్నాడు. యేసు ప్రభువు ఇతను ఒక అహంకారి అని  తనకు తాను నీతిమంతుడని చెబుతున్నాడని  అంటున్నాడు. దేవునికి అహంకారం , గర్వం ఉన్న వారు నచ్చరు.సామెతలు 6: 16-19  వచనాలలో మనం ఇదే చూస్తూ ఉంటాము. సోలోమోను దేవునికి నచ్చని 6 విషయాల గురించి మనం వింటాం. అవి గర్వం తోనే మొదలవుతాయి.

 వినయము యొక్క ఔన్నత్యం

దేవుడు మనము   ఎప్పుడు వినయంతో ఉంటామో అప్పుడే  మనలను అనుగ్రహిస్తాడు. ఇదే మనం లూకా 18:13-14 లలో చూస్తున్నాము. అందుకే ఆ సుంకరిని దేవుడు నీతిమంతునిగా పరిగణిస్తున్నాడు. సుంకరి దూరముగా నిలుచొని తన కన్నులనైనా పైకి ఎత్తుటకు సాహసించక తన రొమ్ము బాదుకుంటూ నన్ను క్షమించు, నా మీద దయ చూపించండి అని వేడుకుంటున్నాడు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. పరిసయ్యుని వలె సుంకరి కూడా ప్రార్ధన చేస్తున్నాడు, కాని అతని ప్రార్ధన విధానం వేరుగా ఉంది. ఎంతో  వినయంతో ఉన్నాడు, అంతే కాక తాను క్షమాపణ కోరుకుంటున్నాడు. దేవాలయం రావడం అతనికి తెలుసు కాని ఆయనకు  అక్కడ ఉండటానికి  అర్హత లేదని తెలుసు. తన గురించి గొప్పగా ఏమి అతను చెప్పుకోవడం లేదు.  తన రొమ్ముల మీద బాదుకుంటున్నాడు. ఎందుకు అంటే  అక్కడ హృదయం ఉంది. దాని నుండి అన్నీ రకాల చెడు గుణాలు వస్తున్నాయి. తాను ఘోర పాపిని అని అతను గుర్తిస్తున్నాడు.  హృదయం మీద బాదుకోవడం వలన తన పాప కారణమైన హృదయాన్ని శిక్షించుకుంటున్నాడు.  ఈ సుంకరి ఇతరుల గురించి అసలు ఏమి అనుకోవడం లేదు. వీరి  ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు అని అడిగితే యేసు ప్రభువు  సుంకరి అని చెబుతున్నాడు.

 మనం  ఎలా ఉన్నాము? పరిసయ్యుని వలె ఉన్నమా? అందరినీ తప్పు పడుతూ, వారి వలె ఉండనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నమా? లేక  మన తప్పులను తెలుసుకొని ఇతరులను నిందించకుండా జీవిస్తున్నమా? ఇక్కడ  మన  వినయానికి దేవుడు పట్టం కడుతున్నాడు.  అహంకారిని శిక్షిస్తున్నాడు. కాని ఈ లోకం వినయాన్ని ఎప్పుడు  ఒక చేతకాని తనంగా చూస్తుంది. పరిసయ్యులు తమ సొంత నీతివంతమైన జీవితం ద్వారా వారు దేవుని దగ్గరకు రావచ్చు అని అనుకుంటున్నారు. ఈ ఉపమానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అహంకారాన్ని, స్వీయ ప్రకటిత నీతిమంతులను దేవుడు కోరుకోవడం లేదు అని తెలియజేస్తుంది.  తనను తాను తగ్గించుకునే వారు దేవునికి ప్రీతి కలిగినవారు అని చెబుతుంది. సుంకరి తాను పాపం చేసానని  తన హృదయాన్ని బాదుకోవడం మనం చూస్తున్నాము, హృదయము నుండే పాప కారణమైన అన్ని ఆలోచనలు వస్తుంటాయి. కనుక హృదయాన్ని బాదుకొనుచున్నాడు. ప్రార్థన ఒక వినయాత్మ హృదయంతో మనం అర్పించాలి. వినయం యేసు ప్రభువును మెప్పించే ఒక సుగుణం.

 ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు?

ఎవరు అయితే తమను తాము నీతిమంతులమని భావిస్తూ మిగిలిన వారు నీతిమంతులు కారు అనే వారిని హెచ్చరిస్తూ చెప్పిన ఉపమానం ఇది. ఇక్కడ మనం పరిసయ్యుని గురించి అతను స్వయం ప్రకటిత నీతిమంత జీవితం గురించి మనం చెప్పుకుంటున్నాము.  కాని మన అందరిలో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఇతరులను నిందించే మనస్తత్వం ఉంది, మన సొంత నీతి, మంచి  మీద మనం ఎక్కువ నమ్మకం కలిగి ఉంటాము. మనకు ఎప్పుడు మనం మంచివారిగానే కనపడుతాముఇతరులు మాత్రం మంచి వారు కాదు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. మనము పాటించే నియమ నిబంధనలు మనలను అహంకారులను చేయకూడదు. నిజమైన వినయం మనకు కలిగించాలి. పునీత ఆవిలా పురి తెరేజమ్మకు వినయం అంటే నిజమైన ఆత్మ జ్ఞానం అంటే నన్ను గురించి నేను తెలుసుకోవడం. నన్ను గురించి నేను ఎప్పుడైతే నిజముగా తెలుసుకుంటానో అప్పుడు నాలో నన్ను నేను పొగుడుకునే అంత గొప్పతనం లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే నేను దేవుని యొక్క కానుకనే, మరియు ఆయన యొక్క దయ ఫలితమే అని తెలుసుకుంటాను. క్రైస్తవ జీవితం దేవుని దయతోనే మొదలవుతుంది. ఇది ఎలా మొదలాయిందో అలానే కొనసాగుతుంది. 

ఎవరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారుఒక సమాధానం నీ మీద  నివు నమ్మకం వుంచుకోవడంతో  దానిని సాధించుకోవడం ఒక విధానము  కాని క్రైస్తవం చెప్పేది ఏమిటి అంటే నిన్ను నివు నమ్ముకోవడం ఆపి దేవుని దయ మీద నమ్మకం వుంచమని చెపుతుంది. అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము.

29 సామాన్య ఆదివారం

 

మార్కు 10: 35-45


అంతట జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి "బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు" అని వేడుకొనిరి. అందుకాయన "నేను మీకేమి చేయగోరుచున్నారు?" అని వారినడిగెను. వారు "మీరు మీ రాజ్యములో మహిమాన్విత  సింహాసనము పై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు" అని ప్రార్ధించిరి. అందులకు యేసు "మీరు కోరున దేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా?" అనెను. "అవును" అని వారు పలికిరి. యేసు వారితో "నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేసెదరు. నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందెదరు. కానీ, నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు. నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును" అని పలికెను. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను, యాకోబులపై కినుక వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి, వారితో ఇట్లనెను: " అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన మనుష్యకుమారుడు  సేవించుటకేగాని సేవింపబడుటకు రాలేదు. అయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను.  

జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి "బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు" అని వేడుకొనిరి. యోహాను యాకోబులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుకుంటున్నాను. వీరు మాత్రమే ఎందుకు ప్రభువును అడుగుతున్నారు? మిగిలిన వారు ఎందుకు అడుగుట లేదు అని ఆలోచిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. వీరు ఇరువురు మరియు   పేతురు  మిగిలిన శిష్యులకంటే ఎక్కువ సమయం ప్రభువు సాన్నిధ్యంలో ఉండేవారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంటే ప్రభువు పేతురు, యాకోబు యోహానులను తీసుకొని ప్రార్ధించుటకు ప్రత్యేకంగా పోవటం మనం సువిశేషంలో గమనించవచ్చు. ఎవరు అయితే ప్రభువుతో ఎక్కువసేపు ఉంటారో, లేక ఆయనతో సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుందో వారు ప్రభువును కోరుకునే విషయాలను  గమనించినట్లైతే,, వీరి కోరికలకు, సాధారణంగా ప్రభువును వారి అవసరముల కొరకు వచ్చి కలిసిన వారి కోరికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేతురు గారు ప్రభువుతో కలిసి తాబోరు పర్వతం మీద ఉన్నప్పుడు ప్రభువుతో  మనము ఇక్కడే ఉందాము అని అంటున్నారు.  యేసు ప్రభువుతో ఎక్కువ సాన్నిహిత్యం కలిగిన ఎవరు అయినా కానీ వారి మాటలు, కోరికలు ప్రభువుతోనే ఉండుటకు, ఆయనతో గడుపుటకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాయి. సమరియా స్త్రీ కూడా ప్రభువుతో ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువగా మాట్లాడింది.  అందుకు  కారణము  ఏమిటిఅంటే ఆయనను వారు చాలా దగ్గరగా చూసారు. దాని ద్వారా అయన గురించి వారికి ఎక్కువగా తెలుసు. ఆయన వారికి ఇహలోకమైనవి కాకుండా పరలోకమునకు సంబందించిన  వాటిని కూడా ఇవ్వగలడు అని వారు తెలుసుకున్నారు. ప్రభువు నుండి మనము పొందాలనుకునేవాటిని పొందుటకు మనం తగిన విధంగా సిద్దపడినట్లైయితే ప్రభువు మనకు వాటిని ప్రసాదిస్తారు.  పేతురుగారు కూడా అయన గురించి తెలుసుకున్న తరువాత అందరు నిన్ను వదలిపెట్టిన నేను నిన్ను వదలి పెట్టను అని అంటున్నారు , కాని  ప్రభువును వదలి పెట్టకుండ ఉండుటకు తగిన విధంగా పేతురు సిద్దపడలేదు. 
"నేను మీకేమి చేయగోరుచున్నారు?" అని వారినడిగెను. వారు "మీరు మీ రాజ్యములో మహిమాన్విత  సింహాసనము పై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు" అని ప్రార్ధించిరి.  నేను మీకేమి చేయగోరుచున్నారని ప్రభువు వారిని అడుగుతున్నారు. వారు వెంటనే ప్రభువు రాజ్యంలో  ఆయన మమహిమాన్విత సింహాసనమున ఆసీనుడైనప్పుడు  ప్రభువు కుడి ఎడమల ప్రక్కన ఆసనములను అడుగుతున్నారు. వారికి ఎక్కడ నుండి ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు? ప్రభువు అనేకసార్లు పరలోక రాజ్యం గురించి చెప్పేవారు. చెప్పడం మాత్రమే కాక, దానిలోనికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అనేక ఉపమానాలద్వారా కూడా ప్రభువు వారికి చెప్పారు. ప్రభువు మాటలను శ్రద్ధగా వీరు ఆలకించేవారు. ప్రభువు మాటలు విని పరలోక రాజ్యం మీద మక్కువ పెంచుకున్నారు. వీరికి ఐచ్చిక కోరికల కంటే పరలోకం మీద కోరిక కలిగేలా ప్రభువు చేశారు. దానిని పొందటమే కాదు, ప్రభువు ఇరుప్రక్కల ఉన్నత ఆసనములు కావాలని వీరు కోరుకుంటున్నారు. ప్రభువు మాటలు శ్రద్దగా ఆలకించిన ప్రతివారు ప్రభువును పరలోకం పొందడం గురించే అడిగారు. సమరియ స్త్రీ, పేతురు, నీకొదేము మొదలగువారు ఒకరకంగా ప్రభువుతో ఉండుటకు ఎక్కువగా   ఇష్టపడ్డారు లేక   ప్రభువు రాజ్యంలో స్థానము కోసం ఆశ పడ్డారు. యేసు ప్రభువు ప్రక్కన సిలువ వేయబడిన మంచి దొంగవాడు కూడా పరలోక రాజ్యంలో స్థానం అడిగారు. యాకోబు యోహానులు కేవలం పరలోక రాజ్యంలో స్థానం మాత్రమే కాదు  ఆయన కుడి ఎడమల ఆసనములను వారు అడిగారు. 
"మీరు కోరున దేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా?" అనెను. యేసు ప్రభువు యాకోబు యోహానుల వేడుకోలును మీరు కోరునది ఏమో మీకు తెలియదు అని చెబుతున్నారు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని ప్రభువు వారితో అంటున్నారు. ఎందుకంటే ప్రభువు పొందబోయే శ్రమల స్నానము ఎంతో కఠినమైనది. అది భారంతో కూడినది. లోకపాపభారమునంతటిని మోసేటువంటిది. అందుకు వీరు ఎంతగానో సిద్ధపడాలి. కేవలం మేము చేయగలం  అని అన్నంత మాత్రమున వారు దానికి సిద్దమైనటువంటి వారు ఏమి కాదు. పేతురుగారు ప్రభువుతో వీరు అందరూ నిన్ను వీడిన  నేను మాత్రము నిన్ను వీడను  అని అన్నారు. కానీ ప్రభువు కష్టంలో ఆయనకు తోడుగా ఉండలేకపోయారు. మీరు పానము చేయు పాత్రము నుండి మేము పానము చేస్తాము అని వీరు అంటున్నప్పటికీ, వీరు ప్రభువుతో ఉండలేకపోయారు. తరువాత ప్రభువు నిమిత్తమై వారు  శ్రమలు అనుభవించారు. పరలోక రాజ్యంలో ప్రభువు తరువాత స్థానమును అడుగుతున్నారు  దానికి సరైన సిద్ధపాటు ఏ వ్యక్తి ఐన కలిగిఉన్నాడా?.  అది దేవుడు ఇచ్చేదే కానీ దానికి అర్హులు ఎవరు అని తండ్రి గుర్తిస్తారు. దానిని పొందుటకు ప్రభువు మార్గమును తెలియజేస్తున్నారు. ఆమార్గము ఏమిటంటే  ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెనని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇది పరలోక రాజ్యంలో గొప్పవానిగా కావాలనుకొనేవారు చేయవలసినది. ప్రభువు మనలను ఆయన వలె మారమని అడుగుతున్నారు. ఇది ఈనాటి సువిశేష సారాంశము. ప్రభువు రాజ్యంలో చేరాలన్న, ఆయన కుడి ఎడమల ఉండాలన్న మనము ఎంత వరకు ప్రభువు వలె మార్పు చెందాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆయన వలె మార్పు చెందుటకు కావలసిన అనుగ్రహం కోసం ప్రార్ధించండి. ఆమెన్ 
  
Fr. Amruth 



సమూయేలు చరిత్ర

 

సమూయేలు చరిత్ర 

సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చరిత్రలో సమూవేలు  అనేక ముఖ్యమైన  విధులను  పోషించాడు. సమూవేలు ఒక యాజకునిగా, న్యాయాధిపతిగా, జీవితపు చివరి అంకంలో ఓక జాతికి గొప్ప నాయకునిగా జీవించాడు. ఒక ప్రవక్తగా  యిస్రాయేలు మొదటి ఇద్దరు రాజులను అభిషేకించాడు.  సమూవేలు యిస్రాయేలు ప్రజలకు మరియు  దేవునికి మధ్యవర్తిగా మరియు వారి కోసం దేవుని అనుగ్రహం కోరేవానిగా పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది.  సమూవేలు జీవిత కాల సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే యిస్రాయేలు ప్రజలు దేవునితో వారి సంబంధమును పునరుద్ధరించుకోవడంజరిగింది. ఈ కాలంలో దేవుని పట్ల వారు చూపిన విశ్వాసంతో ఎంతగా  వారు లాభపడినది, తరువాత    అవిశ్వాసంతో ఏమి   కోల్పయింది సుష్పష్టంగా కనపడుతుంది.  

సమూవేలు అంటే దేవుడు విన్నాడు అని అర్ధం. సమూవేలు తన జీవితాంతం దేవునికి విశ్వాస పాత్రునిగా, విధేయునిగా జీవించాడు. సమూవేలు చిన్నప్పటి నుండి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.  ఇతని జీవితం మొత్తం. దేవుని మాటను వినడం, ఆయనకు విధేయించడం గురించి తెలియజేస్తుంది. సమూవేలు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు దేవునికి విధేయునిగా జీవించాడు. దేవుడు సమువేలును తన అనుచరులలో గొప్పవానిగా చూసాడు. కీర్తన 99:6-7 "మోషే అహరోను ఆయన  యాజకులు , సమువేలు ఆయనకు ప్రార్ధన చేసినవాడు. వారు ఆయనకు మనవి చేయగా ఆయన వారి వేడికోలును ఆలించెను. మేఘ స్థంభం నుండి ఆయన వారితో మాట్లాడెను ఆయన దయచేసిన శాససనములను, కట్టడలను వారు పాటించిరి."  చిన్నప్పటి నుండి దేవుని వాక్కును వినుటను అలవాటు చేసుకున్నవాడు. సమువేలు జీవితం మొత్తం దేవునికే మహిమ ఆరాధన అని తెలియజేస్తుంది. 

హన్నా ప్రార్ధన సమువేలు జననం 

హన్నా సమూవేలు తల్లి. ఆమెకు  పెళ్ళైన   అనేక సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. ఆమె భర్త ఎల్కానా.  ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిపేర్లు హన్నా, పెనిన్నా అను వారు. పెనిన్నాకు పిల్లలుపుట్టారు  కాని  హన్నాకు మాత్రము లేరు. ఎల్కానా షిలోలోఉన్న మందసము వద్ద  బలి అర్పించి, వచ్చిన నైవేధ్య  భాగాన్ని  పెనిన్నాకు ఆమె  సంతానానికి ఇచ్చేవాడు.  హన్నాకు మాత్రము ఒక భాగమే ఇచ్చేవాడు.  భర్త హన్నాను ప్రేమించినప్పటికీ  ఆమె గొడ్రాలు అవుటవలన ఇలా చేసేవాడు.పెనిన్నా కూడా ఆమెను ఎగతాళి చేసేది. యావే మందిరమునకు వెళ్ళినప్పుడల్లా   పెనిన్నా ఆమెను దెప్పిపొడిచేది. హన్నా మాత్రము ఎప్పుడు వాటిని ఇతరులకు చెప్పడంకాని, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం కాని చేసేదికాదు.  తన బాధలను దేవునితో మాత్రమే చెప్పుకునేది. ఒక సారి బలి అర్పించుటకు షిలో వెళ్లారు. అక్కడ దేవుని ఎదుట తన బాధను   నిట్టూర్పుతో, ఏడుపుతో దేవునితో  మాటలాడుతుంది. వారు షిలోవద్ద బలి అర్పించిన తరువాత హన్నా ఆలయంలో ఏడ్చుచు ప్రార్థిస్తుంది. యాజకుడైన ఏలి ఆమెకు త్రాగుట వలన   కైపెక్కినది అనుకోని ఎంతసేపు ఆ మత్తుతో ఉంటావు.  ద్రాక్షసారాయమును వదిలించుకోమని చెప్పాడు. అందుకు  ఆమె ,  అయ్యా నేను డ్రా  త్రాగలేదు, తీరని వేతతో బాధపడుతున్నాను, ,మిక్కిలి  కోపతాపములతో మనసు, హృదయము బ్రద్దలవుతుంటే  ప్రభువుతో మాటలాడుచున్నాను అని చెప్పింది. అందుకు  ఏలి ఆమెతో  దేవుడు నీ మోర ఆలకిస్తాడు,   ప్రశాంతంగా వెళ్ళమని చెప్పాడు. దాని తరువాత వారు రామాకు తిరిగి వెళ్లారు. 

షిలో నుండి ఇంటికి వచ్చిన తరువాత  ఎల్కానా తన భార్య హన్నాను  కలువగా  ఆమె గర్భము ధరించి   కుమారున్ని కన్నది. ఆ  బిడ్డకు సమూవేలు అని పేరు పెట్టారు. సమూవేలు అనగా దేవుని అడిగితిని అని అర్ధం. తరువాత ఆ కుటుంబం మరియొకసారి   షిలోకు వెళ్లారు కాని హన్నా వారితో వెళ్ళలేదు. ఆమె ఎల్కానా మరియు కుటుంబంతో వెళ్లకుండ, సమూవేలు పాలు మానిన సమూవేలును  యావేకు సమర్పిస్తాను అని ఇంటివద్దనే ఉంది. అందుకు ఏల్కానా ఒప్పుకున్నాడు. సమూవేలు పాలు మానిన తరువాత హాన్నా సమూవేలును   తీసుకొని షిలో వెళ్లి అక్కడ బలిని అర్పించి, బాలుని ఎలి వద్దకు తీసుకువెళ్లి, తనకు జరిగిన అన్ని విషములు చెప్పి, బాలున్ని దేవునికి అర్పించి, ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకె ఊడిగము చేయును అని చెప్పింది. అప్పటి నుండి సమూవేలు ప్రభువు మందిరమునే ఉన్నాడు.  హన్నా గొప్ప ప్రార్థన చేసి రామాకు వచ్చింది సమూవేలు మారాము ఎలి పర్యవేక్షణలో యావేకు సేవ చేస్తూ, జీవించాడు.  

ఏలి కుమారులు - యావే సమూవేలును ఏర్పరుచుకొనుట 

ఏలి కుమారులు ప్రభువును  లెక్క చేయక పరమ దుర్మార్గాలు చేశారు. బలి మాంసము వండు సమయములోనే యాజకునికి మాంసము కావాలని తీసుకువెళ్ళేవారు, బలిపశువు క్రొవ్వును పీఠము మీద దహించకముందే యాజకునికి వడ్డించుటకు మాంసం కావాలి, ఉడికినది కాదు అని ముందే  తీసుకెళ్లేవారు. వారివల్ల  యావేకు సమర్పిచు బలికి అగౌరవం కలిగేది. హన్నా ప్రతి సంవత్సరం బలి అర్పించుటకు వచ్చినప్పుడు చిన్న ఏఫోదును తీసుకు వచ్చేది. సమూవేలు దానిని ధరించి యావేకు పరిచర్య చేసేవాడు తరువాత ఆమెకు ముగ్గురు మగ బిడ్డలు ఇద్దరు ఆడ బిడ్డలు పుట్టారు.  

ఏలి ముసలివాడవ్వగా  తన కుమారులు    ప్రభువు గుడారము దగ్గర పనిచేసే  వారితో శయనించారని  తెలిసి, దేవుని పట్ల వారు చేసిన పాపము చెప్పి వారిని మందలించాడు.  కాని వారు ఏలి మాటను పట్టించుకోలేదు. సమూవేలు మాత్రము దేవుని దయకు , ప్రజల మన్ననలకు  పాత్రుడయ్యాడు. దేవుని భక్తుడు ఒకరు ఏలి వద్దకు వచ్చి ఏలి కుమారులు ఇద్దరు ఒక్కరోజే చనిపోతారని చెప్పి, యావే విశ్వసనీయుడైన యాజకునిని ఏర్పరుచు కున్న విషయం చెప్పాడు, ఆ యాజకుడు యావే చిత్తప్రకారం జీవించునని,  అతని సంతతి తరతరములు యావే అభిషిక్తుని ఎదుట మన్నన పొందుతారు అని చెప్పాడు. ఏలి తన కుమారులను మార్చుటకు ఏమి చేయలేదు, కాని హన్నా తన కుమారుని దేవుని సన్నిదిలో అప్పగించింది. ఏలి కుమారులు కూడా దైవ సన్నిధిలోనే ఉన్న వారు మారలేదు. ఏలి కూడా తన కుమారులు ఆడువారిని చెడుచుతున్నారు అని తెలిసిన ఏమి చేయలేదు. ఏలి కుటుంబం  దేవుని సన్నిధిలో ఉండి ఆయన పేరుకు అవమానం కలిగేలా ప్రవర్తించారు. కానీ అక్కడనే ఉన్న సమూవేలు దేవునికి గౌరవం కలిగేలా జీవించాడు. ఎటువంటి వారితో కలిసిఉన్న కాని పాపము చేయకుండా  జీవించడం సమూవేలు ద్వారా తెలుసుకోవచ్చు. 

సమూవేలును  దేవుడు పిలుచుట 

సమూవేలు మందసము దగ్గర నిద్రించుండగా దేవుడు సమూవేలును సమూవేలు, సమూవేలు అని పిలిచాడు. దేవుని వాక్కు వినపడటం ఆ రోజులలో చాల అరుదు. సమూవేలును హన్నా  దేవుని సేవకు సమర్పించినప్పటికీ ఆయనను తన సేవకు  పిలువలసినది దేవుడు. దేవుడు సమూవేలును పిలిచినప్పుడు తన గురువు ఏలి పిలిచినట్లుగా అనుకున్నాడు. ఏలి సమూవేలుకు దేవుని పిలుపును అర్ధం చేసుకొనుటకు సహాయం చేసాడు. ఏలి సమువేలుకు దేవుని పిలుపుకు ఎలా సమాధానము ఇవ్వాలో తెలియజేసాడు. ఏలి సమూవేలుతో మాట్లాడు ప్రభు నీ సేవకుడు వినుచున్నాడు అని సమాధానం ఇవ్వమని చెప్పాడు.   ఏలి కుమారులు  ఘోరమైన పాపములు చేశారు. సమూవేలు ద్వారా  దేవుడు ఏలికి ఒక హెచ్చరిక పంపించాడు.  

దేవుడు  సమూవేలుకు దేవుడు ఇచ్చిన సందేశం అందరికి హెచ్చరిక అయ్యింది. అది ఏమిటంటే  "యిస్రాయేలు జనుల ఎదుట నేనొక  కార్యము చేసెదను దానిని గురించి వినిన వారి రెండు చెవులు గింగురుమనును , ఏలి కుటుంబమునునకు నేను చేసెదననిన కార్యము పూర్తి చేస్తాను ఏలి కుటుంబమును చాల కాలమువరకు శపించితినని తెలియజేయమని, ఎలి కుమారులిద్దరు దేవుణ్ణి నిందించున్నారని ఎరిగియు  మందలింపలేదు, బలులు ,కానుకలు ఏలి కుమారుల పాపలకు ప్రాయశ్చిత్తం చేయలేవు"  అని ప్రభువు సమూవేలుకు చెప్పాడు. ఎలి సమూవేలుతో ఏమి దాచవద్దు దేవుడు నీకు చెప్పినదంత చెప్పమని చెప్పాడు.  సమూవేలు దేవుడు చెప్పిన మాటలు ఏలికి చెప్పిన  తరువాత ఆయన చేయదలుచుకున్న కార్యము చేయునుగాక అని ఏలి  బదులు పలికాడు.

 సమువేలు పెరిగి పెద్దవాడయ్యాడు.  అయన చెప్పిన ప్రతి మాట జరిగింది. ఏలి  అతని కుమారులు చనిపోయారు. దివ్య మందసంపు పెట్టెను ఫిలిస్తీయులు  యుద్ధంలో తీసుకెళ్లారు అని తెలిసి కూర్చున్న చోటనే వెనక్కు వాలి,  మెడ విరిగి చనిపోయాడు. మామ, భర్త చనిపోయారు  అని తెలిసి బిడ్డను ప్రసవించి  ఏలి కోడలు చనిపోయింది. 

మందసమును పిలిస్తియులు ఎబెసెనేరు నుండి అష్డోదునకు తెచ్చారు. అక్కడ దాగోను దేవాలయములో ఉంచారు. ఉదయముకాగానే  దాగోను యావే మందసము ఎదుట నేలపై బోరగిలపడి ఉంది. వారు దాగోనును లేవనెత్తి మరల అక్కడ నిలబెట్టారు.   కాని  తరువాత రోజు మరల దాగోను  యావే మందసము ఎదుట  బోరగిలపడి తల, చేతులు నరకబడి గడప దగ్గర ఉన్నవి. యావే అష్డోదును పరిసరప్రాంత ప్రజలను బొబ్బలతో బాధ పెట్టగ,  అందుకు వారు తట్టుకోలేక మందసమును గాతునకు చేర్చారు. గాతు ప్రజలు కూడా ప్రభువు పెట్టు బాధలు తట్టుకోలేక ఎక్రోనునకు పంపారు. అక్కడ అనేక మంది చనిపోయారు .  మందసము ఏడు మాసములు పిలిస్తుయులతో ఉండగా వారు తట్టుకోలేకపోయారు. ప్రభువు మందసమును వారు అక్కడ నుండి పంపించి వేయుటకు ఎంతో గౌరవంగా బెత్ షెమెషు పొలిమేరల వద్దకు తీసుకు  వచ్చి అక్కడనుండి వెళ్లిపోయారు. బేత్ షేమేషు పౌరులు మందసము వారి కంటపడగానే ఆనందంతో ప్రభువుకు బలి  అర్పించారు.  తరువాత ఆ ప్రజలు పరమ పవిత్రమైన ఆ ప్రభువు ముందట నిలువలేమని కిర్యత్యారీము పంపారు.  అక్కడ  ప్రజలు ప్రభుమందసమును అబీనాదాబు ఇంట చేర్చారు.  అబీనాదాబు కుమారుడు ఎలీయెజెరును ఆ మందసమును శుద్ధి చేసి, కాపాడుటకు నియమించారు. 

అక్కడ మందసము 20 సంవత్సరాలు ఉన్నది.  ప్రజలకు యావేపై  భక్తి కుదిరింది. అప్పుడు సమూవేలు ప్రజలతో  మీరు ప్రభువు వద్దకు రాగోరెదరేని, మీరు కొలుచు అన్యదైవములను వదలివేయండి,  అష్టోరోతును కూడా మీ చెంతనుండి పంపివేయండి,  అపుడు పిలిస్తియుల నుండి యావే మిమ్ము కాపాడుతాడు అని చెప్పాడు. వారు అప్పుడు బాలుదేవతను, అష్టోరోతును వదలి వేశారు. ప్రభువును మాత్రమే  సేవించారు. సమూవేలు ప్రజలను మిస్పా వద్ద  సమావేశ పరచి అక్కడ ప్రజల కొరకు విన్నపం చేస్తాను అని చెప్పడం జరిగింది.  ప్రజలు మిస్పా వద్ద  సమావేశమై నీళ్లు త్రోడి యావే ముందు కుమ్మరించి, ఆరోజు ఉపవాసం ఉండి యావే  ఆజ్ఞ మీరి పాపము చేసాము అని ఒప్పుకున్నారు. అక్కడ వారి కొరకు సమూవేలు దేవుని ప్రార్ధించాడు.

 యిస్రాయేలు మిస్పా వద్ద  సమావేశం అయ్యారు  అని ఫిలిస్తీ యులు  విని వారి మీదకు దండెత్తి వచ్చారు. అప్పుడు  ప్రజలు సమూవేలుకు వారికోసం దేవుణ్ణి వెడమని అడుగగా సమూవేలు ఒక  పాలు తాగు గొర్రె పిల్లను అర్పించాడు. సమూవేలు బలి అర్పించుచుండగానే వారు వచ్చారు యిస్రాయేలు ప్రజలు యుద్దానికి సిద్ధంగా లేరు కనుక దేవుడు  ఉరుము మెరుపుతో వారిలో ఒక గందరగోళం సృష్టించారు, ఆ దెబ్బతో పిలిస్తియులు చెదరిపోయారు. యిస్రాయేలీయులు వారి వెనుకపడి బెత్ కారు వరకు తరిమివేసారు. సమూవేలు మిస్పా మరియు షెను మధ్య ఒక రాతిని యావే వారికి చేసిన మేలుకు గుర్తుగా  నాటారు దానికి ఎబెనెసెరు  అని పేరు పెట్టారు.   యావే ఇంత వరకు మనకు సహాయం చేసెను అని దాని  అర్ధం. సమూవేలు జీవించినంత వరకు ప్రభువు పిలిస్తియులను అణచివేశారు.  సమూవేలు ఉన్నంత వరకు వారికి తీర్పు తీర్చుచూనే ఉన్నాడు. ఆయన్న బేతేలు, గిల్గాలు ,  మిస్ఫా చుట్టి వచ్చి వారికి తీర్పు తీర్చేవాడు. సమూవేలు ప్రాయము దాటిన తరువాత ఆయన కుమారులు యావేలు  మరియు అబీయాలు న్యాయాధిపతులు అయ్యారు కాని వారు లంచగొండులయ్యారు కనుక ప్రజలు రామాకు వచ్చి సమూవేలును  కలుసుకొని అయ్యా నీవు ముసలి ప్రాయంలో ఉన్నావు నీ కుమారులు నీలాంటి వారు కారు కనుక మాకు అన్య జాతుల  వలె ఓక రాజును నియమించండి అని  చెప్పారు.   పెద్దల వేడుకోలు సమువేలుకు నచ్చలేదు. 

అపుడు సమూవేలు ప్రభువుతో మాట్లాడగా, ప్రభువు ఈ ప్రజలను  వినుము, వీరు నిన్ను  కాదు నన్ను నిరాకరించారు, వీరిని  ఐగుప్తునుండి  తీసుకొనివచ్చినప్పటి నుండి నాకు చేసినట్లే నీకును అపచారము చేశారు. వీరు వేరే దేవరలను కొలిచారు, నీవు వారి మాట వినుము కానీ గట్టిగా హెచ్చరించమని చెప్పగా  సమూవేలు ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు చెబుతూ మీరు కోరుకునే  రాజు మీ కుమారులను రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు, రథముల ముందు పరుగెత్తుటకు, సైన్యములో కొంతమందికి అధిపతులుగా నియమిస్తాడు,  వారితో పొలము దున్నించి కొత కోయుటకు, యుద్ధ సామాగ్రిని తయారు చేసుకొనుటకు వాడుకుంటాడు. మీ   కుమార్తెలను అత్తరు పూయుటకు, వంటలు వండుటకు, రొట్టెలు  కాల్చుటకు వాడుకుంటారు. మీ పొలములలో సారముగల వాటిని తీసుకుంటారు. మీపొలములను తీసుకొని వారి ఉద్యోగులకు ఇస్తారు, మీ పంటలలో పదియవ వంతు తీసుకొని తమ నౌకరులకు ఇచ్చుకుంటారు. మీ పశువులలో ఇష్టమైన వాటిని తీసుకొని తన పనులు చేయించుకుంటాడు. మీరు అతని బానిసలు అవుతారు, మీరు ఎన్నుకొనిన రాజును తలంచుకొని మీరు పెద్ద ఎత్తున ఏడ్చుదురు అని  చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ వారు అతని మాట వినక మాకు రాజును  నియమించాలని పట్టుపట్టారు.  అప్పుడు సమూవేలుతో  ప్రభువు వారికి ఇష్టము వచ్చినట్లు చేయుమని చెప్పాడు. అప్పుడు సమూవేలు ప్రజలకు మీమీ పట్టణములను వెళ్ళమని చెప్పాడు. ఒకరోజు   ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. 

ఈ సమయంలోనే  సౌలు తన  తండ్రి గాడిదలు తప్పి పోగా, తండ్రి వాటిని వెదకిరమ్మని సౌలును పంపాడు. వారు ఎంతగా వెదకినప్పటికీ  అవి కనపడలేదు.  అప్పుడు సౌలు తండ్రి గాడిదలను గురించి కాక కుమారుని కొరకు   బాధపడునేమో అని తన వెంట వచ్చిన సేవకునికి వెనక్కిపోవుదుము అని చెప్పగా ఆతడు ఇక్కడ ఒక   దైవభక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయన చెప్పినదంతా జరుగును. అతనిని చూచిన మనకు మార్గము చెప్పవచ్చును అని చెప్పగా  సౌలు అతనికి ఇవ్వుటకు మనవద్ద ఏమిలేదు కదా అని చెప్పాడు.  అప్పుడు ఆ సేవకుడు తన వద్ద పావుతులము వెండి ఉన్నది దానిని అతనికి ఇచ్చెదము అని చెప్పాడు. వారు కొండమీదఉన్న  పట్టణమునకెక్కి నీళ్లు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను దీర్ఘదర్శి ఉన్నడా  అని అడిగారు.  అందుకు వారు ఉన్నాడు, ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పించబోవుతున్నారు అని చెప్పారు. మీరు ఉన్నత స్థలమునకు వెళ్లకమునుపే దర్శించవచ్చును త్వరగా వెళ్ళమని  అని చెప్పారు. సౌలు సేవకునితో కలసి పట్టణములో ప్రవేశింపగానే సమూవేలు అతనికి ఎదురుపడ్డాడు. ఆ ముందు రోజునే ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. సౌలు ఎదురుపడగానే ప్రభువు సమూవేలుతో నా ప్రజలను పాలించునని నేను ముందుగా చెప్పినది ఇతని గురించే అని చెప్పాడు. సౌలు సమువేలుతో అయ్యా! దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ?  అని అడుగగా సౌలు దీర్ఘదర్శిని నేనే, నా కంటే ముందుగా వెళ్లి ఉన్నత స్థలమును చేరుకొనుము, నేను ఈరోజు నీతో భుజింపవలెను, రేపు నిన్ను పంపెదను  నీవు వెళ్లునప్పుడు నీలోని సంధియును తీర్చెదను, తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి కనుక వాటి గురించి చింతించకు  అని చెప్పాడు. యిస్రాయేలు కోరునది నిన్నును నీ కుటుంబమునుకదా అని చెప్పాడు అప్పుడు సౌలు నేను యిస్రాయేలు తెగలలో అల్పమైన బెన్యామీను తెగవాడను, ఆ తెగనందలి అల్పమైనది అటువంటి నా మీద ఇట్టి పలుకులు పలకనేలా అని అన్నాడు. 

సమూవేలు సౌలును అతని దాసుని భోజనశాలకు తీసుకొనివెళ్ళి అతిధుల ముందుటి భాగమున వారిని కూర్చుండబెట్టి వేరుగా వండి ఉంచిన వేట తొడను తీసుకొని వచ్చి  సౌలు ముందుట పెట్టి భుజింపమని చెప్పాడు. అక్కడ నుండి   నగరమునకు వచ్చి, సౌలుకు పడక సిద్దము చేయగా అక్కడ ఆతడు నిద్రించాడు. వేకువనే సమూవేలు సౌలును నిద్రలేపి నగర చివరకు వచ్చిన తరువాత సౌలు సేవకుని  సౌలుతో సాగిపొమ్మని చెప్పించి సౌలును అక్కడే ఆపి , యావే ఆజ్ఞను అతనికి తెలియజేస్తాను అని చెప్పాడు. సమూవేలు తైలపుబుడ్డిని తీసుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పట్టుకున్నాడు. యావే నిన్ను తన ప్రజలకు నాయకునిగా చేసాడు నీవు ప్రజలను పాలించి శత్రువుల నుండి వారిని కాపాడవలెను .  నిన్ను నాయకునిగా ప్రభువు చేసాడు అనుటకు గుర్తులు ఏమిటంటే నన్ను నీవు విడిపోగానే బెన్యామీను పొలిమేరలలో సెల్సా వద్దగల రాహేలు సమాధివద్ద ఇద్దరు నిన్ను కలుసుకొని మీ గాడిదలు దొరికినవి అని చెప్పెదరు. మీ తండ్రి నీ గురించి చింతించుచున్నాడు అని  చెప్పుతురు అని తరువాత తాబోరు సింధూరము చేరగానే  బేతేలు పోవు ముగ్గురు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుకగా  ఇత్తురు వానిని తీసుకొనుము. తరువాత   గిబియా, తేలోహిము వెళ్లి అక్కడ ఫిలిస్తీయుల శిబిరం ఉంది అక్కడకు చేరగానే ప్రవక్తల సమాజము   ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును, వారు ప్రవచనములు పలుకుతారు, వారితోపాటు నీవుకూడా ప్రవచించెదవు , దానితో నీవు పూర్తిగా మారిపోయెదవు, ఇవన్నీ జరిగిన తరువాత తగినవిధంగా పనులు చేయుము అని చెప్పాడు. ఇక నీవు ముందుగా వెళ్లి గిల్గాలు చేరుము నేను అక్కడకు వచ్చెదను. నీవు నాకోసం ఏడురోజులు వేచియుండుము నేను వచ్చి నీవు ఏమి చేయాలో చెప్పదను అని చెప్పాడు.

 సౌలు సమూవేలును వీడివెళ్ళగానే ఆయన చెప్పినవన్నీ జరిగాయి. దేవుడు అతని  హృదయమును పూర్తిగా మార్చివేసాడు. అతడు గిబియా చేరగానే ప్రవక్తల సమూహం ఎదురవగానే దేవుని ఆత్మ అతని మీదికి రాగా, సౌలు ప్రవచనములను పలికాడు.  అది చూచిన ప్రజలు కీషు కుమారునికి ఏ గతి పట్టెనని  పలికారు. తరువాత సౌలు ఇంటికి వెళ్ళాడు. సమూవేలు మిస్పా వద్ద  యావే ఎదుటికి  ప్రజలను రప్పించి వారితో యిస్రాయేలు దేవుడు మిమ్ములను ఐగుప్తు నుండి మరియ శత్రువుల బారి నుండి కాపాడుకుంటూ వచ్చాడు.  మీరు మాకు రాజును నియమించాలని, దేవుణ్ణి పట్టుపట్టారు., మీ తెగల వారిగా యావే ముందు నిలవండి అని చెప్పాడు, సమూవేలు చీట్లు వేయగా బెన్యామీను తెగలోని  మంత్రీ కుటుంబంలోని కీషు కుటుంబంలోని సౌలు వంతు వచ్చినప్పుడు అతను కనపడలేదు. అతడు సామానులు మధ్య దాగుకొని ఉన్నాడు అని  ప్రభువు తెలియచేయగా అతనిని తీసుకొని వచ్చారు. అప్పుడు సమూవేలు ప్రజలతో దేవుడు ఎవరిని ఎన్నుకొన్నారో చూసారో కదా, ఇటువంటి వారు యిస్రాయేలులో ఎవరు లేరు అనెను అపుడు జనులు మా రాజు కలకాలము జీవించు గాక అని కేకలు వేశారు. అపుడు సమూవేలు రాజు ఎలా పాలించునో చెప్పారు, అలానే ఒక గ్రంథమును రాసి యావే ముందుట ఉంచాడు. తరువాత ప్రజలను వారివారి ఇళ్లకు పంపించాడు.  

కొంతమంది యితడు మనలను ఎట్లు రక్షింపగలడు అని సౌలును తక్కువ చేసి మాట్లాడారు. సౌలు అమ్మోనీయులను  ఓడించిన తరువాత ప్రజలు సమూవేలుతో సౌలును తక్కువ చేసి మాట్లాడిన వారిని తీసుకోని రమ్ము మేము వారిని వధిస్తాము అని చెప్పారు. సమూవేలు ప్రజలతో మనము గిల్గాలుకు పోవుదము, అక్కడ రాజనియామమునకు ఒప్పుకుందుము అని మాటయిత్తుము అని చెప్పి గిల్గాలు వెళ్లి అక్కడక సౌలును రాజుగా ప్రకటించాడు. సమూవేలు ప్రజలతో మీ మనవుల ప్రకారం మీకు రాజును నియమించాను, రాజే మిమ్ము ఇకనుండి నడిపిస్తాడు. నేను ముసలివాడిని అయ్యాను, చిన్ననాటి నుండి మీకు నాయకుడిగా నిడిపించాను. నాలో ఏమైనా దోషం ఉన్న యెడల యావే ఎదుట, రాజు ఎదుట నిరూపించమని అడిగాడు. నేను ఎవరిది  ఏదైనా తీసుకున్నానా? లంచము తీసుకొని న్యాయము చెప్పానా? మోసం చేసానా? నేను ఏమైనా చేసినచో రుజువు చేయండి నేను వారికీ అది ఇస్తాను అని చెప్పాడు. దానికి ప్రజలు అటువంటిది ఏమి లేదు అని సమాధానం ఇచ్చారు. 

నాలో ఏ అపరాధము లేదనుటకు యావే సాక్షి, ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి అని సమూవేలు చెప్పగానే  ప్రజలు అవును ప్రభువే సాక్షి అని బదులిచ్చారు.  తరువాత దేవుడు ఎలా వారిని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినది, ఎలా వారికి భూమి ఇచ్చినది, వారు ఆయన మాట వినక ఇతర దేవతలను కొలిచినందుకు శిక్షించినది  సమూవేలుతో ప్రజలు చెప్పారు. దేవుణ్ణి వారు ఎలా మొరపెట్టుకొన్నది శత్రువుల నుండి విడిపించమని చెప్పినది చెప్పి, దేవుడు న్యాయాధిపతులను పంపి వారి బానిసత్వము నుండి విడిపించగా వారు చీకు చింతలు లేక బ్రతికిన విషయం వెల్లడి చేసాడు. యావే మీ రాజు , అయినను మీరు మాకు యావే కాక మరియొక రాజు కావాలి అని అడిగారు. ఇతడే మీరు ఎన్నుకొనిన రాజు, మీరును మీ రాజును ప్రభువు పట్ల భయ భక్తులు చూపించి , ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన మీకు మేలు జరుగును లేదేని మీరు ముప్పు తిప్పలు పడునట్లు చేయును.   ప్రజలను అక్కడే ఉంచి వారి ముందు ఒక గొప్ప కార్యము చేసాడు గోధుమ కాల సమయంలో యావెను ప్రార్ధించగా , సమూవేలు చెప్పినట్లుగా ఉరుములతో వాన కురిసింది. దీని ద్వారా ప్రభువును వారు రాజు కావలెనని అడిగి చేసిన తప్పును తెలుసుకోవాలని వారికి చెప్పాడు. వారు సమూ వేలుతో   మా తరుపున యావేకు విన్నపము చేయుము , రాజును కోరుకొనుట కూడా మేము చేసిన తప్పిదమే అని  పలికారు. అందుకు సమూ వేలు భయపడకుడు మీరు తప్పు చేసిన మాట వాస్తవమే కానీ  ప్రభువును అనుసరించుట మాత్రం మానకుడు, ఆయనను పూర్ణ హృదయముతో సేవింపుడు, విగ్రహములు మాయే, అవి కాపాడలేవు, వాని వలన ప్రయోజనము లేదు. యావే తన ఘనమైన నామమును నిలబెట్టుకొనువాడు  కనుక మిమ్ము పరిత్యజించడు. నేను మీకొరకు మనవి చేసెదను. మీకు ధర్మ మార్గమును చూపెదను  అని వారికి బోధించాడు. 

సాలు ఒక ఏడాది పాలన చేసిన తరువాత   పిలిస్తియుల దండును హతము చేసినందుకు వారు ఇస్రాయేలీయుల   మీద కోపముగా ఉన్నారు. యిస్రాయేలీయులు భయంతో ఉన్నారు. శత్రువులు వారి చుట్టూ చేరారని వారు పారిపోయారు. సౌలు గిల్గాలు వద్ద ఉన్నాడు. సౌలు సమూవేలు చెప్పిన గడువు ప్రకారము ఏడూ రోజులు  ఆగి సామూవేలు రాలేదని, ప్రజలు వీడిపోతున్నారని దహన బలిని, సమాధాన బలిని సిద్ధం చేయించి తానె దహన బలిని అర్పించాడు. అపుడు సమూవేలు వచ్చి ఎంతపని చేసితివి అని అన్నాడు.   నీవు ప్రభువు ఆజ్ఞ పాటించి ఉండినట్లైయితే ఎప్పటికి నీ కుటుంబము వారే రాజుగా ఉండేవారు అని చెప్పాడు. ప్రభువు ఇంకొకరిని నాయకునిగా  ఎన్నుకొనును అని చెప్పి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయాడు. 

సౌలు తన పాలనను సుస్థిరం చేసుకొని పాలించసాగాడు. కొన్నాళ్లకు సమూవేలు సౌలు వద్దకు వచ్చి నేను యావే పంపగా వచ్చి, నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా అభిషేకించాను, ఇప్పుడు ప్రభువు మాటలు వినుము. యిస్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చునప్పుడు అమాలేకీయులు త్రోవలో వారినెదిరించి బాధించారు, వారిని నేను శిక్షించాలని ప్రభువు అంటున్నాడు. కనుక నీవు వెంటనే పోయి వారిని  వధింపుము, వారిలో ఒక్కరిని కూడా బ్రతుకనీయవద్దు. ఎడ్లను, గొర్రెలను , ఒంటెలను, గాడిదలను, అన్నింటిని మట్టుపెట్టుము ఇది యావే ఆజ్ఞ అనిచెప్పాడు. సౌలు అమాలేకీయులను సంహారించాడు. ఆగాగును చంపలేదు.. క్రొవ్విన ఎడ్లను దూడలను  గొర్రెలను గొర్రె పిల్లలను చంపలేదు. మంచి వాటిని మిగుల్చుకొని పనికిరాని వాటిని శాపము పాలుచేసి వదించారు. సమూవేలుకు ప్రభువు దివ్యవాణి సౌలును రాజును చేసినందుకు నేను విచారించుచున్నాను.  అతను నా ఆజ్ఞలను పాటించక , దిక్కరించాడు అని సమూవేలుతో చెప్పాడు. 

మరునాడు సమూవేలు సౌలును చూడబోయాడు. అప్పటికే సౌలు గిల్గాలుకు వెళ్ళాడు అని  తెలియగ అక్కడకు వెళ్ళాడు. సమూవేలు సౌలును కలవగానే సౌలు సమూవేలుతో ప్రభువు నిన్ను దీవించునుగాక నేను యావే  ఆజ్ఞను పాటించితిని అని చెప్పాడు. అందుకు సమూవేలు అది నిజమైతే గొర్రెల అరుపులు ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకా రింగున  మారుమ్రోగుచున్నవి ఎందుకు అని  అడిగాడు. అపుడు సౌలు వాటిని అమాలేకీయుల నుండి కొన్నాము అని చెప్పాడు.    ప్రజలు శ్రేష్టమైన ఎడ్లను, గొర్రెలను యావేకు బలి ఇచ్చుటకు అంటిపెట్టుకొని మిగిలిన వాటిని శాపము పాలు చేసి సంహరించాము అని చెప్పాడు. అపుడు సౌలుతో సమూవేలు  నీ మాటలు ఆపు, ప్రభువు నాతో చెప్పిన మాటలు వినుము, నీవు అల్పుడవైనను  యావే నిన్ను  యిస్రాయేలుకు నాయకునిగా చేయలేదా ? నిన్ను  రాజుగా చేయలేదా? నీకు యావే ఒక పని అప్పగించి ఉన్నాడు. అది నీవు ఎలా దిక్కరించావు? దోపిడిసొమ్ము దక్కించుకోవడం కోసం యావే ముందు పాపం చేసావు అని అడిగాడు. 

అందుకు సౌలు నేను యావే మాట ఆలకించాను, ఆగాగును తీసుకొచ్చాను, గిల్గాలు వద్ద యావేకు బలి అర్పించుటకు ప్రజలే వాటిని అట్టిపెట్టుకొన్నారని చెప్పాడు. అందుకు సమూవేలు యావే బలుల వలన సంతృప్తి చెందునా? విధేయత వలనగాదా? బలి కంటే విధేయత మేలు నీవు యావే మాట త్రోసివేసావు కనుక యావే నీ రాజరికమును త్రోసివేసెను. అని చెప్పాడు. అందుకు సౌలు ప్రజలకు భయపడి నేను అటుల చేసి పాపము కట్టుకున్నాను. నా తప్పు క్షమించి, యావెను మ్రొక్కుటకు నాతో రమ్మని అడిగాడు. దానికి సమూవేలు నేను నీ వెంట రాను, నీవు యావే పలుకులు  తిరస్కరించితివి కనుక నీ రాజపదవిని యావే తిరస్కరించాడు అని చెప్పి,  మారాలి వెళ్లపోతుండగా సౌలు అతని అంగీ చెంగు పట్టుకోగానే అది చినిగింది. సమూవేలు అతనితో  ఈరోజు ప్రభువు యిస్రాయేలు రాజ్యమును నీ చేతినుండి లాగివేసి నీకంటే యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను అని చెప్పాడు. మరల సౌలు సమూవేలుతో యావెను మొక్కుటకు నాతో రమ్ము అని    అడుగగా సమూవేలు సౌలు వెంట వెళ్ళాడు. అతడు యావేకు మ్రొక్కాడు. సమూవేలు  ఆగాగును తీసుకొని రమ్మని చెప్పగా వారు అటులె చేసెను. అప్పుడు సమూవేలు అతనితో నీకత్తి వలన తల్లులు బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లి తన బిడ్డను కోల్పోవును అని  యావే ఎదుట అతనిని నరికివేసెను. తరువాత సమూవేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు చనిపోవువరకు సమూవేలు అతనిని  కలుసుకొనలేదు. 

సౌలు గురించి సమూవేలు పరితపించాడు. యావే సమూవేలుతో నేను సౌలును తిరస్కరించినందుకు ఎంతకాలము దుఃఖించెదవు.  కొమ్మును తైలమును నింపుకొని వేళ్ళు, బేత్లెహేము వాసియైన యిషాయి వద్దకు పంపుతున్నాను. అతని కుమారులలో ఒకరిని  నేను రాజుగా   ఎన్నుకొంటిని అని చెప్పాడు. అందుకు సమూవేలు  నేను పోలేను, ఈ మాట వింటే సౌలు నన్ను చంపివేస్తాడు అని అన్నాడు. అందుకు నీవొక  ఆవు పెయ్యను తీసుకెళ్ళుము, ఆ ఊరివారితో యావేకు బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పుము. యిషాయిని కూడా బలి అర్పణమునకు పిలువుము. అక్కడ నీవేమి చెయ్యాలో  అక్కడ చెప్పెదను నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకించాలి అని చెప్పాడు. 

సమూవేలు యావే చెప్పినట్లు బేత్లెహేము  వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి భయపడ్డారు.  వారు మీరు మా మేలు ఎంచి వచ్చారా  లేక కీడు ఎంచి వచ్చారా  అని అడుగగా మీ మేలు కోరే  వచ్చాను, ఇక్కడ బలి అర్పించడానికి  వచ్చాను, మీరు శుద్ధి చేసుకొని రావాలి అని చెప్పాడు. యిషాయిని అతని కుమారులను సమూవేలు  శుద్ధి చేసి బలికి ఆహ్వానించాడు. వారు అప్పుడు బలికి వచ్చారు. అపుడు సమూవేలు యిషాయి పెద్ద కుమారుని చూసి ప్రభువు అతనిని ఎన్నుకొనబోతున్నాడు అని అనుకున్నాడు. యావే సమూవేలుతో రూపమును,  ఎత్తును చూసి భ్రమపడకుము, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, హ్రదయమును అవలోకించును  అని చెప్పాడు.  అదే విధంగా యిషాయి కుమారులు ఏడుగురు సమూవేలు ఎదుట నిలిచారు కానీ యావే వారిని ఎన్నుకొనలేదు. అప్పుడు సమూవేలు నీ కుమారులు వీరేనా ? అని అడిగారు. అపుడు అతను చిన్నవాడు పొలమున   గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాడు. ఎవరిని అయినా పంపి అతనిని పిలిపింపుము,  అతను వచ్చినంత వరకు నేను భోజనమునకు కూర్చొను అని చెప్పాడు. దావీదు  రాగానే యావే  నేను కోరుకొనినవాడు ఇతనే అని  చెప్పాడు. సమూవేలు తైలపు కొమ్ము  తీసుకొని అన్నలేదుట అతనికి అభిషేకము చేసాడు. అప్పటి నుండి యావే ఆత్మ దావీదును ఆవహించి   అతనిలో ఉండిపోయింది. దాని తరువాత సమూవేలు రామాకు  వెళ్ళిపోయాడు. 

దావీదును చంపుటకు సౌలు ప్రయత్నిస్తుండగా దావీదు రామా  వద్ద ఉన్న సమూవేలు వద్దకు వచ్చి జరిగిన విషయాలు మొత్తము చెప్పాడు. అపుడు  దావీదు, సమూవేలు నావోతు చేరి అక్కడ ఉన్నారు. సౌలు అది తెలుసుకొని సేవకులను దావీదును పట్టుకొనుటకు పంపాడు. వారు వచ్చి సమూవేలు ప్రవక్తల సమూహమునకు నాయకునిగా నిలుచుట చూడగా దేవుని ఆత్మ సౌలు సేవకుల మీదకు రాగ వారుకూడా ప్రవచనములు పలికారు. ఇది విని సౌలు మరల కొంతమంది సేవకులను పంపారు. వారును అలానే చేశారు. అపుడు మూడవసారి కూడా వారు అంతే చేశారు. అపుడు సౌలు  స్వయంగా రామాకు వచ్చి  అక్కడివారిని సమూవేలును దావీదును చూసారా అని అడుగగా వారు నావోతు వద్ద   ఉన్నారు అని చెప్పగా  సౌలు అక్కడకు పోవుటకు బయలుదేరగా దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినది.  అపుడు  అతడు ఆవేశముతో బట్టలను తొలగించుకొని సమూవేలు  ఎదుటనే ప్రవచనలు చెప్పాడు. కాని  దావీదు అపుడు యోనాతాను వద్దకు వెళ్ళిపోయాడు. తరువాత కొన్నాళ్ళకు  సమూవేలుమరణించాడు. యిస్రాయేలీయులందరు సమావేశమై అతని కొరకు శోకించారు. రామాలో అతని ఇంటిలో అతనిని పాతిపెట్టారు. 

 సమూవేలు చనిపోయిన తరువాత సౌలు పిలిస్తియుల మీద యుద్ధమునకు పోవుటకు యిస్రాయేలును సిద్ధముచేసాడు కానీ వారిని చూసి భయపడ్డాడు. అతడు యావెను సంప్రదించిన కాని  యావే స్వప్నంలోకాని ఊరీము వలన కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏమి సెలవియ్యలేదు. అపుడు చనిపోయిన వారిని ఆవాహకము చేసుకొనే ఒక మాంత్రికురాలను సమీపించి   మృతలోకం నుండి నేను సమూవేలుని రప్పింపుము అని అడిగాడు. ఆమె సమువేలు లేచి వచ్చుట చూసి భయపడి కేకవేసింది. ఆమెతో సౌలు అతడు నీకు ఎవరు కనపడిరి అని అడుగగా భూమిలో నుండి దైవములలో ఒకడు లేచి వచ్చుచున్నాడు అని చెప్పింది. సౌలు అతని ఆకారము గురించి అడుగగా దుప్పటి కప్పుకొనిన ముసలివడెవడో లేచి వస్తున్నాడు అని చెప్పాడు. అపుడు వెంటనే సమూవేలు అని గ్రహించి సౌలు లేచి నేలపై సాగిలపడి దండము పెట్టాడు.   సమూవేలు సౌలుతో నీవు నన్ను కుదురుగా ఉండనియక ఎందుకు రప్పించితివి అని అడిగాడు.  అపుడు సౌలు ఫిలిస్తీయులు నాపై యుద్ధమునకు వచ్చారు, నేనేమి చెయ్యాలో తెలియడం లేదు. ప్రభువు నాతో మాట్లాడలేదు.  దిక్కుతోచక నిన్ను రప్పించితిని అని చెప్పాడు. అపుడు సమూవేలు యావే నిన్ను విడనాడి, నీకు శత్రువు కాగ, నన్ను సంప్రదించి ప్రయోజనమేమి? యావే చెప్పినట్లే చేసాడు. ప్రభువు రాజ్యమును నీ నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చివేసెను. నీవు ప్రభువు మాట పాటింపవైతివి. కనుకనే యావే నిన్ను వీడెను,   ప్రభువు నిన్నును,  నీ  తనయులును  ఫిలిస్తీయుల చేతికి అప్పగించును రేపు నీవు నీ కుమారులు  నాతో   ఉందురు అని చెప్పాడు. 

పునీత ఆవిలాపురి తెరెసమ్మ

 

పునీత ఆవిలాపురి   తెరెసమ్మ 

తెరెసా ఔన్నత్యం -పుట్టుక మరియు బాల్యం 

తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు. 1622 సంవత్సరంలో  లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె పునీతురాలుగా ప్రకటించబడింది. 1970 సెప్టెంబర్ 27 న ఆమె తిరుసభ పండితురాలుగా ప్రకటించబడింది. ఈమె ఒక సాధారణ స్త్రీ వలె కనపడిన అసాధారణమైన పట్టుదల, సాంఘిక అసమానతలను ఎదుర్కొని విజయాలను సాధించుటలో గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచిన అరుదైన వ్యక్తి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జీవితంలో అనేక ఆటంకాలలో కూడా తాను అనుకున్న దానికి సాధించిన ఒక స్త్రీ మూర్తి. మనం ప్రేమించే వారి కోసం మనం ఎంత చేయవచ్చో చూపించిన ఒక గొప్ప స్త్రీ. తిరుసభలో వరకట్నం  లేకుండా సన్యాసినులను మఠంలోనికి తీసుకున్న మొదటి వ్యక్తి. అనేక నూతన సంప్రదాయాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి. తీరుసభ మొదటి స్త్రీ పండితురాలు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఎలా జయించగలమో నేర్పి, మానవుడు తనను తాను ఎలా జయించవచ్చో నేర్పించిన విజయాశీలి.  మానవునిలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలో అంతరంగిక ప్రయాణం ఎలా చేయాలో నేర్పిన గొప్ప గురువు మరియు గొప్ప పండితురాలు.

ఆమె తండ్రిగారి పేరు అలెన్సో సంచేస్  ఆమె తల్లి పేరు  బియాట్రీస్ ఆహుమాద చిన్నప్పుడు తెరెసా పునీతుల జీవితాలు చదివి ఆ పునీతుల చరిత్రల వలన చాలా ప్రోత్సాహం పొందేది. తెరెసా మరియు ఆమె సోదరుడు రోడ్రిగో బాల్యంలోనే  ఇద్దరు కలిసి మూర్సు అనే ప్రాంతం లో వేద సాక్షిగా మరణించాలి అని ప్రయాణం అయి వెళ్లారుఆవిలా పూరీ గోడల బయటకు వెళ్ళి నాలుగు స్తంభాలు అనే ప్రాంతంలో వారి బాబాయి వారిని చూసి ఇంటికి తీసుకొనివచ్చాడు. తరువాత రోడ్రిగో ఇది మొత్తం చేసినది తెరెసా అని ఆమె మీద నెపం మోపాడు. తరువాత తన సోదరుడితో ఎడారిలోని క్రైస్తవ సన్యాసుల జీవిత విధానాలు ఆటల రూపంలో ఆడుకునేవారు.  


యవ్వన వయసు- జీవితపు మొదటి మలుపు

తెరెసా 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లి చనిపోయారుఆ సమయములో ఆమె మరియమాతకు చాలా దగ్గర అయ్యారు. మరియమాతను తన తల్లిగా ఉండమని కోరారు. ఈ ప్రాయములో ఆమె కొన్ని వీర గాధలు చదవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా తన అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఆరంభించారు. తన కుమార్తెలో వస్తున్న ఈ మార్పును గుర్తించిన ఆమె తండ్రి ఆవిలాలో ఉన్న పునిత  అగుస్టిన్ మఠ కన్యల బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. ఇక్కడ ఉన్న  కన్య స్త్రీల వలన మరలా తన పాత నిర్మల మనస్సును పొందగలిగింది.   ప్రార్ధన గురించి  తెలుసుకున్నారుకానీ తన అనారోగ్య కారణాలతో అక్కడనుండి 1532 లో ఇంటికి రావడం జరిగినది. 1533 లో తాను కార్మెల్ సభలో సన్యాసిగా అవ్వాలని  తన తండ్రిని  అనుమతి అడగగా అందుకు ఆయన  నిరాకరించారు. తరువాత 1535 ,నవంబర్  2 న  ఆవిలాలో ఉన్న కార్మెల్ మఠంలో ప్రవేశించారు.

సన్యాస జీవిత ప్రారంభం - అనారోగ్యం 

1536 లో సభ వస్త్రాన్ని తీసుకుంది.  1537 లో తన  మాట పట్టు తీసుకుంది దాని తరువాత ఆమె ఘోరమైన అనారోగ్యం పాలయ్యింది.  కనుక 1538 లో ఆమెను తన ఆరోగ్య కుదుటపడటానికి  మఠం నుండి బయటకు తీసుకురావడం జరిగినది.  ఈ సమయములోనే ఆమెకు తన బాబాయి  ప్రార్ధన చేయడము గురించి ఒక పుస్తకం ఇవ్వడము జరిగినది.  ఆ పుస్తకము తనకు చాలా  ఉపయోగపడింది,  ఆమె ఆరోగ్యం కుదుటపడకపోగా తాను మరణపుటంచుల వరకు వెళ్ళింది. 1539 లో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఆమె చనిపోయింది అనుకున్నారుకానీ మూడు రోజులకి కొద్దిగా చలనం కలిగినది. తరువాత ఆమెను మఠానికి తీసుకొచ్చారు పక్షవాతం తో దాదాపు మూడు సంవత్సరాలు బాధపడ్డారు. పునీత యోసేపు గారి ప్రార్ధన సహాయముతో పూర్తిగా కొలుకున్నది . కానీ  ఆరోగ్య పరంగా ఆమెకు  తన మరణం వరకు కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తన అనారోగ్య కారణాలతో మరియు ఇతర కారణాలతో  ప్రార్ధన జీవితాన్ని అంతగా పట్టించుకోలేదు.

ముఖ్యమైన మలుపు- శ్రమల క్రీస్తు స్వరూప దర్శనం 

 1557 లో ఒకసారి మఠానికి పండుగ సందర్భంగా యేసు ప్రభువు స్వరూపాన్ని తీసుకురావటము జరిగినది అది యేసు ప్రభువు  శ్రమలు పొందుతున్న స్వరూపము  అది చూసిన తరువాత తెరెసా  యేసు ప్రభువు శ్రమలకు తాను కారణం అని తాను మరల  యేసుప్రభువుకు  ఎటువంటి శ్రమలు ఇవ్వకూడదు అని ఆయన శ్రమలలో ఆయనకు ఓదార్పు  ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె యేసు ప్రభువుకు చాల మంది స్నేహితులు అవసరము ఉంది మనం ఆయన స్నేహితులము కావాలని తన తోటి సన్యాసినులతో చెప్పేది. ఈ మఠం లో ఆమె చాలా శ్రమలు అనుభవించిందిఆమె తన అనారోగ్యం వలన అనేక బాదలు అనుభవించినది.  ఈ సమయములోనే  తన మొదటి ప్రార్ధన అనుభూతిని పొందింది. తన స్నేహితులు,  ప్రార్ధనలో ఆమె పొందే అనుభవాలు మొత్తం కూడా సాతాను నుండి పొందుతుంది అని చెప్పారు.  1556 సంవత్సరంలో   ఆమె ఆధ్యాత్మిక గురువు ఫ్రాన్సిస్ అనే  యేసు సభ గురువు ఆమె అనుభవాలు  దేవుని నుండి వచ్చే అనుభవాలు అని చెప్పారు. ఆమె అనేక దర్శనాలు పొందేది. కొన్ని సార్లు ప్రార్దనలో ఉన్నప్పుడు వచ్చే అనుభవాలు చాలా గొప్పగా ఉండేవి. ఒక్కోసారి ఆమె ప్రార్ధన చేసే సమయములో గాలిలోకి ఎత్త బడేది. అది చూసిన మిగిలిన వారు  ఆమెను క్రిందకు తీసుకురావడానికి ఆమెను పట్టుకొని లాగేవారు. 1559 లో ఆమెకు ఒక దర్శనము యేసు ప్రభువు ఆమెకి కనపడటము జరిగినది. ఆమె అప్పటినుండి నిజంగా నాకు యేసు ప్రభువు కనపడ్డారు  అలాగున  ఈ దర్శనాలురెండు సంవత్సరాలు పాటు ఆమెకు కలిగాయి.

తెరెసా హృదయాన్ని దేవదూత బాణంతో పొడిచిన అనుభూతి 

ఒక దర్శనములో దేవదూత  ఒక  అగ్నిజ్వాలతో  కూడిన ఒక  బంగారు బాణం తో ఆమె హృదయమును గుచ్చినట్లుగా అనిపించినది. తరువాత శారీరకముగా మరియు ఆధ్యాత్మికముగా కూడా ఆమెకు అది  బాధతో కూడిన తీయటి అనుభూతిని మిగిల్చింది. ఆమె చనిపోయిన తరువాత ఆమె సమాధిలో ఆమె హృదయం పాడు కాకుండా ఉన్నది అంతే కాదు ఆమె హృదయం మీద రెండు గీతలు ఉండటం గమనించడం జరిగింది. ఇప్పటికీ ఆ హృదయం అల్భ దె  థోర్మెస్ అనే ఊరిలో దేవాలయంలో మనం చూడవచ్చు.  

ఆమె ఉన్న ఇన్కర్ణేషన్ మఠంలో  150 మంది మఠవాసులు ఉండటము వలన అది ప్రార్ధనకు అనువుగా లేదు.  మఠానికి వచ్చేపోయె  వారితో మఠం ఒక సంత వలె ఉంది అని ఆ జీవిత విధానాన్ని తన ఆధ్యాత్మిక గురువుల సహాయంతో సంస్కరించాలని అనుకున్నది.  పేదరికంలో మఠాన్ని స్థాపించటానికి అందరూ అడ్డుపడిన కాని  ఆమె ఆగస్ట్ 24న 1562వ సంవత్సరంలో నూతన మఠాన్ని స్థాపించారు. 1563 మార్చిలో తెరెసా నూతన మఠానికి వెళ్ళింది.  కఠినమైన నియమాలతో పాత కార్మెల్ జీవితాన్ని పునరుద్ధరించాలని ఆశతో మొదలు పెట్టిన పని మొదలైనది. కొద్ది మంది సన్యాసినులతో ఎప్పుడు ప్రార్ధన ధ్యానం చేస్తూ వారు అందరికీ ఆదర్శముగా జీవించడం మొదలు పెట్టారు. మొదటి ఐదు సంవత్సరాలు ఆమె ఆ మఠంలోనే  గడిపింది.

మఠాలను స్థాపించుటకు గల ఉన్నతమైన ఉద్దేశం 

ఆమె ఎందుకు ఈ మఠాన్ని స్థాపించారు అని ఒక ప్రశ్న అడిగినప్పడు మనకు ఆమె ఉన్న పాత మఠంలో ప్రార్దనకు అనుకూల వాతవరణం లేదు అందుకే ఆమె నూతన విధానాన్ని స్థాపించారు అని మనం చెప్పవచ్చు. దీనికి ఆమె తన తోటి సహోదరీలతో చెప్పిన సమాధానం మరియొకటి ఉన్నది. అది ఏమిటి అంటే ప్రొటెస్టంట్లు కతొలికులకు వ్యతిరేకంగా ఉద్యమిచ్చిన కాలంలో అనేక దేవాలయాలలో దివ్య సత్ప్రసాదనికి అవమానం కలిగించారు. ఏ విధంగా అంటే అనేక దేవాలయాలలో దివ్య మందసంలో ఉన్న యేసు దివ్య సత్ప్రసాదంను బయటకు తీసి క్రింద పడవేసి అవమానం చేశారు. ఆ అవమాననికి తాను అంటే ఆవిలాపురి తెరేసమ్మ పరిహారం చేయాలని అనుకున్నారు. అది ఏవిధంగా అంటే ఈ నూతన కార్మెల్ మఠంలో ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాదంలో ఉన్న యేసు ప్రభువు ఆరాధించబడుతాడు అక్కడి సన్యాసినులతోటి ఆవిధంగా అప్పుడు జరిగిన అవమాననికి తాను పరిహారం చేయాలి అని ఈ నూతన మఠం స్థాపించాలి అనుకున్నది.  

దివ్య పూజబలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె అనేక ప్రార్ధన అనుభవాలు పొందేది. ఆమె పొందిన ప్రార్దన అనుభవాలలో కొన్నింటిలో ఆమె ప్రార్దన చేస్తూ ఉండగా అవకాశంలోనికి ఎత్త బడేది. ఆ సమయాలలో తన తోటి సన్యాసినులు ఆమెను పట్టుకొని క్రిందకు లాగేవారు. 

 తెరెసా జీవితంలో యేసు ప్రభువు 

పునీత ఆవిలాపురి తెరేసమ్మ కార్మెల్ మఠంలో తీసుకున్న పేరు యేసుని తెరెసా. ఈమె జీవితం మొత్తం యేసు ప్రభువును ఏ విధంగా తాను కలవాలి, లేక ఆయనను తాను ఎలా పొందాలి అనే కోణంలో మాత్రమే ఆలోచించింది అన్నట్లుగా తాను జీవించిది. ఎందుకంటె తాను ఎలా యేసు ప్రభువును చేరుకోవాలి, ఆయన కోసం తాను ఏమి చేయగలదు మరియు ఏమి చేసింది మాత్రమే ఆమె జీవితం మొత్తం కూడ. అంతకు మించి మనం ఆమె జీవితంలో ఏమి చూడం. ఆమె పేరు యేసుని తెరెసా అని ఎలా మార్చుకున్నదో అలానే తాను యేసు ప్రభువును తన అనువణువున నింపుకున్నది. 

యేసు ప్రభువును ఆమె ఎలా చూసింది అని ఒక ప్రశ్న అడిగితే నాకు కొన్ని విషయాలు ఆమె గురించి గుర్తుకు వస్తాయి అవి ఏమిటంటే? ఆమెకు  యేసు ప్రభువే  సర్వస్వం. ఆయన మానవ గుణాలను ఎంతో అభిమానంచేది, సమరియా స్త్రీ తో మాటలాడిన విధానం, వ్యభిచారం లో పట్టుబడిన స్త్రీ ని కాపాడిన విధానం ఆమెకు దైవ కరుణ తెలియజేస్తుంది. మరియ మర్తల వలె ఆయన వద్దనే ఉండాలని, తన మాటలు వినాలని ,  తనకు సేవ చేయాలని కోరుకున్నది. యేసు ప్రభువుని ప్రతి గుణాన్ని ఆమె ప్రేమించింది. ఆయనను తన గురువుగా భావించింది. యేసు ప్రభువు తన మార్గంగా, గమ్యంగా  భావించింది. యేసు ప్రభువుకు ఎలా తను సేవ చేయగలను అనే ఆలోచించింది. యేసు ప్రభువును ఆమె ఎంతలా ప్రేమించింది అంటే ఆమె చేసేది ఏది  అయిన అది క్రీస్తును పొందటం కోసమే అనే విధంగా ప్రేమించింది.  ఆయనను పొందటమే తన జీవిత ధ్యేయం అయ్యింది. తనకు  ప్రార్ధన యేసు ప్రభువును కలుసుకునే ద్వారం అయ్యింది. తనలో యేసు ప్రభువు తనలో ఉన్నారని గ్రహించింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి తనలోనికి తాను ఎలా వెళ్ళాలి అని నేర్చుకున్నది. ఒక వ్యక్తి ఆత్మలోనికి ప్రవేశించడం చాలా క్లిష్టమైన ప్రయాణం అని తెలుసుకుంది. అయిన ఈ తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి ప్రార్దన సహయం ద్వార  అంతరంగిక ప్రయాణం మొదలుపెట్టింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకుంది. ఈవిధంగా ఆమెకు ప్రార్దన తనలో ఉన్న యేసు ప్రభువును కనుగోని ఆయనతో ఉండటం, ఆయన అనుభూతిని పొందటం అయ్యింది. 

కార్మెల్ సభ పురుషుల విభాగాన్ని పునరుద్ధరణకు అంకురార్పణ 

 1567 లో కార్మెల్ సభ అధిపతి జాన్ బాప్టిస్ట్ రోస్సీ ఆవిల వచ్చారు. ఆయన తెరేసా ను మెచ్చుకొని ఇంకా కొన్ని సన్యాసినుల మఠాలను స్థాపించాలని ప్రోత్సహించారు. అదే విధముగా రెండు పురుష మఠాలను స్థాపించటానికి అనుమతి ఇచ్చారు.   అప్పుడు  మెదిన దేల్ కంపో మళగొన్ వయ్యాడోలిద్ ,తోలేదోపస్ట్రాన సాలమాంక మరియు అల్బ దె  తొర్మెస్  లలో మఠాలు స్థాపించారు.

తెరెసాకు  పురుషుల విభాగానికి సంబంధించి సంస్కరించబడిన  రెండు మఠాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించినది. పునీత సిలువ యోహను మరియు ఆంథోనీ హెరోడియా ల సహకారంతో  1568నవంబర్లో దురుఏలో వద్ద  మొదటి మఠాన్ని స్థాపించారు. తరువాత 1571 లో సెగోవియ వద్ద ,1574 లో బేయస్ సేగుర వద్ద ,1575 లో సేవియ్యే వద్ద 1576 లో కరవక శిలువ వద్ద స్థాపించారు.


నిష్పాదుక కార్మెల్ సభ 

1576 లో  సంస్కరణ ఇష్టపడని కార్మెలియులుసంస్కరించబడిన కార్మెలియులను  హింసించటము మొదలు పెట్టారు. పియసెంజ లో జరిగిన జెనెరల్ చాప్టర్లో ఎటువంటి నూతన మఠాలను ఏర్పాటు చేయవద్దని చట్టం చేశారు. తెరెసాను ఆమె ఏర్పాటు చేసిన ఏదో ఒక మఠానికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించారు. అన్నింటికీ అంగీకరిస్తూ ఆమె తోలేదోలో ఉన్న మఠానికి పరిమితం అయ్యారు.  మిగిలిన వారిని అనేక కష్టాలకు గురిచేశారు. పునీత తెరేసమ్మను అనేక మంది తీరుసభ అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈమె మఠ వాసి అని చెబుతూ మఠంలో ఉండకుండా దేశ దిమ్మరి వలె తిరుగుతుంది అని అన్నారు. కాని ఆమె తన సంతోషం కోసం ఎప్పుడు బయటకు వెళ్లలేదు. కేవలం ఏదో ఒక నూతన మఠం స్థాపించడానికి అక్కడ యేసు ప్రభువును సేవించేలా చేయడానికి మాత్రమే వెళ్ళింది. ఆమె ప్రయాణాలు అన్ని కూడా చాలా కష్టంతో కూడినవి ఎందుకంటే ఆనాటి రోజులలో రాహదారులు ఏమి లేవు, మరియు ప్రయాణాలు గుర్రపు లేదా గాడిద బండ్ల మీదనే జరిగేది. అనేక సార్లు క్రింద పడటం కూడా జరిగేది. కాని యేసు ప్రభువు సేవించ బడాలి అనే కోరికతో ఆమె నూతన మఠలకు స్థలం చూడటానికి లేదా స్థాపించడానికి వెళ్ళేది. 

తెరెసా చివరి రోజులు 

ఆమెజీవితపు చివరి మూడు సంవత్సరాలు అందలుసియా పాలెన్సియ ,సొరియా బుర్గోస్ మరియు గ్రనాద లో మఠాలను స్థాపించారు.  1577 ఆవిలా కు వెళ్ళింది. ఆమెను అనేక విధాలుగా విమర్శించిన కార్డినల్ కూడా ఆమెకు అనుకూలముగా  మాటలాడారు . 1580 లో నూతన మఠాన్ని  స్థాపించారు. 1580  జూన్ 22 న గ్రెగోరి 13 వ పోఫు గారు  నిష్పాదుక కార్మెల్ ప్రొవిన్సు ను ఏర్పాటు చేశారు. 1582సెప్టెంబర్ 19 న మెదిన  దేల్ కాంపొను వదలి  20 న ఆల్బ దె తోర్మేస్ వచ్చారు. అప్పటికే రక్తస్రావంతో  బాధ పడుతున్నారు.   అక్టోబర్ 4 న ఆల్బ దె తోర్మేస్ వద్ద  మరణించారు. మరుసటి రోజు  గ్రెగోరియన్ కాలెండరు మార్పుతోటి  అది అక్టోబర్ 15 అయ్యింది.  ఆమె తన మఠ వాసులకు ప్రార్థన ,  మన ఆత్మలో ఉన్న దేవుని కనుగొనట ఎలా ?, ఆధ్యాత్మిక సంపూర్ణత ఏ విధముగా సాధించాలి అనే అంశాలమీద రాసిన గ్రంధాలు అనేక మందికి దేవుని తెలుసుకొనిచేరుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. 

Fr. Amruth OCD

లూకా 5: 33-39

  లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము త...